Thursday, May 28, 2009

మరోసారి మొండిచేయి

జాతీయ పార్టీని ఎన్నుకుంటే జరిగేదేమిటో నాలుగు రోజుల్లోనే అనుభవంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల పట్ల తనకు ఉన్న చులకన భావం మరోసారి చూపించింది. 33 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే మనకు సహయమంత్రి పదవులు విదిలించింది. తమిళనాడు, కర్ణాటకలు కేంద్రానికి ఇచ్చింది తక్కువమంది ఎంపీలనైనా ముఖ్యమైన శాఖలు వారు దక్కించుకుంటే, మనవాళ్ళు సహయమంత్రులుగా పదవి ఇచ్చామని మన్మోహనుడు ఫోన్ చేసి చెప్తే ఆనందంతో పొంగి పొర్లుదండాలు పెట్టేస్తున్నారు. ఇలా జరగటం ఇది రెండోసారి. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో రాజీవ్, ఇందిరల నామస్మరణ మారుమ్రోగింది. తెలుగువారిలో గుర్తుంచుకోదగ్గ నాయకులు లేరని, ప్రతి పధకానికీ కాంగ్రెస్ వాళ్ళ అమ్మ మొగుడి పేరు పెట్టుకుంటూ అతి విశ్వాసం చూపిస్తేనే రాలిన మెతుకులివి.

ఇలా చెయ్యటం వాళ్ళకి కొత్త కాదు, మనకు అంతకన్నా కొత్త కాదు. జాతీయ పార్టీలలో రాష్ట్రనాయకులు ఏది కావాలన్నా అధిష్టానాన్ని దేబిరించాలే కానీ డిమాండ్ చెయ్యలేరు. చేస్తే ఉన్న పదవి పోయి పార్టీలో ఉన్న మన ప్రత్యర్థి వర్గాన్ని వరిస్తుంది. రాజశేఖరుడు మన రాష్ట్రం నుండి 33 మంది ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపించింది, మేడం తనను ముఖ్యమంత్రిగా పీకేసి ఇంకో గన్నాయిగాడిని పెట్టకుండా ఉండటానికే కానీ అంతకుమించి మనకేమి తెప్పించటానికి కాదు. ఈసారి ఎలాగూ పూర్తి మెజారిటీ రాదనుకుని ఎన్నికలయ్యాక కడపకి పోయి కూర్చుని, రాజధాని కలరాతో ఏడుస్తున్నా నాకేం సంబంధం లేదన్నట్టు సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ వున్నారు మన రాజావారు. తీరా గెలిచేసరికి ఆనందంతో తబ్బిబ్బయిపోయి ఈ ఆనందం చాలు మాకింకేమి అక్కర్లేదు, ఇంకా ఎక్కువిస్తే మా వాళ్ళకు గుండె ఆగిపోవచ్చు, ఇక్కడ మా వేషాలు చూసీ చూడనట్టు వదిలేసి, అప్పుడప్పుడు వచ్చి పొగడటానికి మాత్రమే ఇంతమంది ఎంపీలను పంపుతున్నాను అని చెప్పినట్టున్నారు అధిష్టానానికి. రేపెప్పుడైనా అధిష్టానం కళ్ళెర్రజేస్తే, మీ కోసం ఇంతమందిని గెలిపించాను, మాకు రావలసిన పరిశ్రమలు, రైళ్ళు, రోడ్లు అన్నీ వదులుకున్నాను, మీ సేవకి మావాళ్ళని సహయమంత్రులుగా పెట్టాను, ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేస్తే నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని, పాత సినిమాల్లో భార్యలు భర్తల్ని నిష్టూరమాడినట్టు, అధిష్టానాన్ని సెంటిమెంట్ డైలాగులతో కొట్టొచ్చు.

ఈ జాతీయ పార్టీలను గెలిపించినంత కాలం మన పరిస్థితి ఇంతేనేమో. తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలను భూస్థాపితం చేసేసి, ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుని, తమకు రావలసినవి డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండటం తప్ప దక్షిణాది రాష్ట్రాలకు వేరే మార్గం లేదు. ఆంధ్రాలో ఆ పని అన్నగారు మొదలుపెట్టి సగం పూర్తి చేసారు, మిగతా పని పూర్తి చెయ్యటానికి "అన్నయ్య" వస్తాడనుకుంటే, ఆయన మొదట్లోనే పూర్తిగా చతికిలబడ్డాడు. బలమైన ప్రాంతీయ పార్టీ ఒక్కటే అవ్వటంతో, అది నచ్చనప్పుడల్లా మళ్ళీ కాంగ్రెస్‍ని ఎన్నుకుని ఇలా ఢిల్లీ వంక చూస్తూ, వాళ్ళు మనకు తప్ప అందరికి పంచుతున్నవి చూసి గుటకలు మింగటం వినా వేరే దారి కనపడదు. మెల్లగా ప్రజారాజ్యం పుంజుకుని, వున్న రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ కాంగ్రెస్ లాంటి పార్టీలకు చోటివ్వకూడదని నా ఆశ. నా ఆశేగానీ జరుగుతున్నవి చూస్తుంటే వచ్చే ఎన్నికలకి ప్రజారాజ్యం అనే పార్టీ వుంటుందో లేదో అని అదో అనుమానం. మిగతా పని పూర్తి చెయ్యటానికి మళ్ళీ అన్నగారే పుట్టాలి కాబోలు.


Saturday, November 8, 2008

రచ్చ గెలిచాం, ఇంట గెలిచేది ఎన్నడో?

ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు భాషాభిమానులు పోరాడిన తర్వాత తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రకటించింది. 2004లో తమిళులు తమ భాషకి ప్రాచీన భాషంటూ ఒక హోదా కట్టబెట్టేవరకు, మనకు కనీసం ఆ ఆలోచన కూడా లేదు. వాళ్ళకివ్వగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి స్లోగన్లివ్వటం మొదలుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం మనల్ని గుర్తించట్లేదని, అరవ మంత్రులు అడ్డుపడుతున్నారని, మన నాయకులు పట్టించుకోవట్లేదని వాపోయాం. ఇన్నాళ్ళూ కదలకుండా ఉన్న కేంద్రం హఠాత్తుగా ఎన్నికల సంవత్సరంలో కదిలింది. మన నాయకులేమో కోర్ట్ లో కేసున్నా పర్లేదంటూ, రాష్ట్రావతరణ దినోత్సవం రోజున ప్రకటన ఇప్పించేసి, మా పని మేం చేసేసాం, మమ్మల్నింక తప్పు పట్టటానికి ఏమీ లేదని చేతులు దులిపేసుకున్నారు. ఈ హోదా వల్ల మనకేం ఉపయోగం, తెలుగు ప్రాచీన భాషైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి, నవీన భాష కావాలి కానీ, అని చాలా మంది పెదవి విరిచారు. ఈ వాదనల్లో నిజమున్నా, ప్రాచీన భాష హోదా కోసం చేసిన పోరాటం మరీ అంత అనవసరమైనది కాదని నా అభిప్రాయం. తెలుగుకేదో కొత్త గుర్తింపని కాదుగాని, ఈ ప్రయత్నం తెలుగు భాషాభిమానుల్లో కావలసినంత కదలిక తీసుకువచ్చింది. ఈ నాలుగు సంవత్సరాలూ భాషని గురించిన చర్చలు, వాదాలు ఎడాపెడా చేసాం, విన్నాం. భాష విషయంలో మనది కొంచెం తోలుమందం కాబట్టి, పొరుగువారు వచ్చి వీపు మీద చరిచాక గాని తేరుకోలేదు. మన వాళ్ళకు పోటీ, పోలిక ఉంటే తప్ప సొంత భాషైనా రుచించదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన హోదా తెలుగు భాషకు వచ్చిన గుర్తింపు అనటం కంటే, భాషాభిమానుల్లో పెరిగిన స్ఫూర్తికి గుర్తు అనుకోవచ్చేమో. తెలుగువాళ్ళం చాలా అరుదుగా, అదీ తప్పు చేస్తున్నట్టు సిగ్గుపడుతూ చూపించే మన భాషాభిమానాన్ని నిర్భయంగా అందరికీ ప్రదర్శించటానికి వచ్చిన ఒక సందర్భంగా అనుకోవచ్చు.

ఢిల్లీకెక్కి రచ్చ చేసి రచ్చ గెలిచాం గానీ ఇంట గెలిచే సూచనలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాం గానీ, తెలుగువారితో వారి మాతృభాష గొప్పదని, మిగతా ఏ భాషలకూ తీసిపోదని అనిపించలేకున్నాం. మన రాష్ట్రంలో భాషాభిమానులంటే గ్రహాంతరవాసుల క్రింద లెక్క. మనదైన దాన్ని అభిమానించమని ఎవ్వరూ చెవినిల్లు కట్టుకుని పోరాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు విషయంలో చెప్పాల్సి వస్తోందంటే కారణం, అది ఈ రోజు తెలుగువారికి పరాయిదైపోవటమే. భాషా, అది నేర్పే సంస్కృతీ, మనలో భాగమైనప్పుడు భాషాభిమానం సహజంగా వస్తుంది. చిన్నప్పట్నుంచీ తల్లి ఒడిలో గోరుముద్దలు తింటూ పెరిగిన పిల్లవాడు తల్లిని సహజంగా, unconditionalగా ప్రేమిస్తాడు కానీ, అదేదో భాధ్యతలానో, పక్కవారి కోసమో ప్రేమించడు. చిన్నప్పుడు చందమామ పుస్తకం ఊహల్లో విహరింపజేస్తుంటే, ఎప్పటికప్పుడు వేమన నీతులు జాగ్రత్తలు చెబుతూ ఉంటే, ఎంకి పాటలు సేదతీరుస్తుంటే, వాగ్గేయకారుల కీర్తనలు నవరసాలు ఒలికిస్తూ మురిపిస్తుంటే, ఇవి అనుభవించిన వారెవరైనా తెలుగెందుకని అడుగుతారా? దాని వల్ల ఉపయోగాలు ఏమీ లేవని ఎన్ని చెప్పినా ఒదులుకుంటారా? తమ పిల్లలకి నేర్పకుండా ఉంటారా? భాష జీవితంలో విడదీయరాని భాగమై పెనవేసుకుపోవాలి. అలా కానప్పుడు అది కేవలం మాట్లాడటానికి ఉపయోగించే ఒక మీడియం అవుతుంది, అంతే. చిన్నతనంలో సరిగ్గా పరిచయం చేస్తే, జీవితాంతం మనల్ని మురిపించి మైమరిపించగల శక్తి తెలుగు భాషకి ఉంది. కానీ అసలు ఇప్పటి పిల్లల కలలోకైనా మనం తెలుగుని రానివ్వటం లేదు. ఇంకది వారిని ఎలా మురిపిస్తుంది, ఎలా వారి జీవితంలో భాగమౌతుంది. భాషైనా, సంస్కృతైనా, మరే భావనైనా, మనలో లేకుండా మన చుట్టూ జీవితంలో ఉంటే దాన్ని మనం అభిమానించకపోగా, చిరాకు పడతాం. ఎందుకంటే అది మనకొక అనవసరపు బరువులా, మనకు ఉపయోగపడని ఒక బాధ్యతలా పరిణమిస్తుంది. మనలో భాగం కానిదేదైనా ఒక అదనపు లగేజ్. చిన్నతనంలో తెలుగులోని తియ్యదనాన్ని రుచి చూసినవారు, పెద్దయ్యాక ఎన్ని భాషలు నేర్చినా, అది బ్రతకటానికి పనికి రాకపోయినా దాని పై అభిమానం పోగొట్టుకోరు. ఇప్పుడు మనం చేయవలసినవి, మారుతున్న పరిస్థితులకు సరిపోయే విధంగా భాషను పరిపుష్టం చేసుకోవటమూ, మన పిల్లలకు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికీ, దానితో మాట్లాడటానికీ, తియ్యనైన మన భాషను అందించటమూ.

మన తెలుగు భాష గొప్పదని, చరిత్ర గలదని చెప్పుకుంటాం. కన్నడరాయని ప్రశంసల్ని, సుబ్రమణ్యభారతి పొగడ్తల్ని, తెలుగుతల్లి మెడలో దండలుగా వేసి మురిసిపోతాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మరో దండ వేయించాం. ఆమె పాదాల దగ్గర ప్రణమిల్లే భక్తి ప్రపత్తులు లేకుండా కేవలం దండలతోనూ, వంక దండాలతోనూ, సరిపెట్టటం చిత్తసుద్ధి లేని శివపూజ లాంటిది. ఎన్నాళ్ళని పోయిన శతాబ్దపు పాచిపోయిన గొప్పలు చెప్పుకుంటాం. మన భాషకు కొత్త హంగులు దిద్దాల్సిన సమయం వచ్చింది.


Sunday, October 5, 2008

హిందూ తీవ్రవాదం

ఇన్నాళ్ళూ మనకు తీవ్రవాదం అంటే ఇస్లామిక్ తీవ్రవాదమే గుర్తొచ్చేది. ఇప్పుడు కొత్తగా హిందూ తీవ్రవాదం మొదలయ్యింది. గుజరాత్ మారణకాండలోను, ఒరిస్సా మతఘర్షనల్లోను వీరు తమ ఉనికిని బలంగా చాటుకున్నారు. ఇవి చెదురుమదురు సంఘటనలే అనుకోటానికి లేదు. ఈ దాడులు గమనిస్తే ఇవి పక్కా ప్రణాళిక ప్రకారం చేసినవని తెలుస్తుంది. ఇంత ప్రణాళికాబద్దంగా జరిగే హింసని తీవ్రవాదమనే అనాలి. దీన్నీ మిగతా మత తీవ్రవాదాలతో సమానంగా పరిగణించి ఖండించాలి అనటంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు. కానీ అసలు గొడవ ఎక్కడ మొదలౌతుందంటే, ఈ దాడుల్ని తీవ్రవాదంగా భావించి ఖండించే మేధావులు, మిగతా మతాలు చేస్తున్న హింసకి మాత్రం కారణాలు వెతుక్కుని, వారి ఆవేశాన్ని సానుభూతితో పరిశీలించాలని చెప్పటం దగ్గర. మాటకు పదిసార్లు లౌకికత్వం గురించి మాట్లాడే మన ప్రభుత్వము, మన మేధావి వర్గము, నిజంగా అలాగే ప్రవర్తించుంటే ఈ కొత్త తీవ్రవాదం పుట్టక పోయుండేదని నా నమ్మకం.

ఎలాంటి తీవ్రవాదులకైనా జనాల సహకారం ఎంతో కొంత లేకుండా కార్యకలాపాలు చెయ్యటం కష్టం. నేను, ఈమధ్య వరకు కూడా హిందూ ఓటు బ్యాంకు, హిందూ తీవ్రవాదం అనేవి సాధ్యం కావని అనుకునేవాడిని. ఎందుకంటే ఇవి రెండూ కుదరాలంటే ఆ మతం చాలా వ్యవస్థీకృతమైనదిగా వుండాలి. హిందూ మతం శతాబ్దాలుగా ఎన్నో విభిన్న శాఖలుగా చీలి, ఎన్నో కొత్త భావాల్ని కలుపుకుని, ఎన్నో పరస్పర విరుద్దమైన విషయాలను తనలోకి ఇముడ్చుకుని, ఒక జీవన విధానంగా అవతరించింది. అది ఒక మతానికుండే నిర్మాణాన్ని(structure) ఎప్పుడో పోగొట్టుకుంది. నిజానికి దాన్ని ఒక మతమనటమే తప్పు. మతం ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించలేదు. ఇంత చిందరవందరగా ఎవరికి వారుగా బ్రతికే గుంపులోంచి చాలా ఆర్గనైజ్డ్‍గా, నిర్ధిష్టమైన లక్ష్యం కోసం పని చేసే తీవ్రవాదం పుట్టడము, నిలదొక్కుకోవటమూ కష్టం. కానీ ఇప్పుడు మొదలయ్యింది. అందుకు నాకు తోచిన కారణాలు ఇవి.

ఈ దేశంలో మిగతా మతాలతో పోలిస్తే హిందువుల్లో తమ మతం గురించిన పట్టింపులు మొదట్నుంచి తక్కువ, పరమత సహనం ఎక్కువ. కానీ ఈ మధ్య కాలంలో సామాన్య హిందువుల్లో కూడా మతాభిమానము, మనమంతా హిందువులం అనే భావనా పెరిగింది. విభిన్న కులాలుగా, విభిన్న ఆచారాలతో బ్రతుకుతున్న వీరిని గుంపుగా చేరుస్తున్నదేమిటో గమనిస్తే అది వారి మతమూ, ఫిలాసఫీ కంటే, పక్క మతాల పై పెరుగుతున్న నిరసన, కోపం ఎక్కువగా కనిపిస్తుంది. హిందువులుగా చెప్పబడుతున్న ఈ వైవిధ్యమైన గుంపు ఎప్పుడూ proactiveగా ఒక్కటవ్వలేరు, కేవలం reactiveగానే ఒక్కటిగా కలవగలరు. మిగతా మతాల వారిలా proactiveగా కలిసుండటానికి వీరికి కారణాలు బహుతక్కువ. ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఐకమత్యం కూడా అలా ప్రతిక్రియ(reactive)‍గా వచ్చిందే. అందుకు కారణం, తమ దేశంలోనే తమ మత విశ్వాసాలకి అడుగడుగునా సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వారు భావించటం. అది నిజమేనని నిరూపించి, వారిలో మరింత అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్న బాంబు దాడులు, క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సాంస్కృతిక దాడులు, వారిని వెనకేసుకొస్తున్న ప్రభుత్వము, మరియు మేధావి వర్గము.

ఒక పక్క వారంవారం ఠంచనుగా బాంబులు పేలి జనం చస్తుంటే, వాళ్ళవాళ్ళని మన పోలీసులు వేధిస్తున్నారంట, అందుకే కడుపు మండి పేలుస్తున్నారు పాపం, అని సమర్ధించేవారు కొందరు. మన మతాన్ని, విశ్వాసాల్ని కించపరుస్తున్నారు అంటే, మతప్రచారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, పక్క మతాల్ని తప్పుపట్టకుండా మతప్రచారం ఎలా చేసుకుంటారు పాపం,  మనమే సర్దుకోవాలి అని వెనకేసుకొచ్చేవారు ఇంకొందరు. తప్పు ఎవరు చెసినా ఒకటే, అని ఖండిస్తే చల్లారిపోయే దానికి, మనం చెయ్యలేదా, మనలో లేదా అని ఎదురుదాడికి దిగి మరింత నిప్పు రాజేస్తారే కానీ, వారికి అవి తప్పుగా కనిపించవు. ఈ మేధావి వర్గం రెండు వైపులా ఖండించటం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఏకపక్ష ఖండనే. హైందవేతరుల తప్పుల్ని ఖండించాల్సొచ్చినప్పుడు కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడరు. ఈ రకంగా మైనారటీలను చంకనేసుకుని గారాభం చేసే వాళ్ళున్నంత కాలం ఈ సమస్య పరిష్కారం అవ్వదు.

హిందువుల్లో ఈ అతివాద గ్రూపులు ఎప్పట్నుంచో వున్నాయి కానీ ఇన్ని రోజులు వాటికి సామాన్య జనాల సపోర్టు, సానుభూతి లేదు. పైగా వ్యతిరేకత వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అసలు బీజేపీకి దక్షిణ భారతదేశంలో అడుగు పెట్టటం సాధ్యమవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ జరిగింది. ఈ అతివాద గుంపులను ఇన్ని రోజులు అడ్డుకున్నది, వ్యతిరేకించినది కూడా మితవాద హిందువులే. ఇప్పుడు వారే పక్కకి తప్పుకుని అతివాదులకు దారి వదిలేస్తున్నారు. తమ మతం పై జరుగుతున్న సాంస్కృతిక, భౌతిక దాడుల పట్ల వారి అసంతృప్తి, అతివాదులకు ఇంధనంగా మారుతోంది. ఏ మతంలో ఐనా తీవ్రవాదులు తమ చర్యలకు ఏదో ఒక కారణాలు చూపిస్తూనే వుంటారు. వీరికి సామాన్యుల నుంచి సానుభూతి దొరకటం ప్రమాదకరమైన విషయం. నిన్న మొన్నటి వరకు హిందూ అతివాదుల చర్యలకు చిరాకుపడ్డ హిందువులు కూడా, ఇప్పుడు "అలాంటి అతిగాళ్ళకు పోటీగా, ఇలాంటి అతిగాళ్ళు వుండాల్లే, లేకపోతే ఇంకా రెచ్చిపోతారు" అనటమే, వారికి సానుభూతి పెరుగుతోందనటానికి సాక్ష్యం. తమకు పెరుగుతున్న సపోర్ట్ గమనించే, వారు కూడా ఇష్టానుసారం భారీ దాడులకు దిగుతున్నారు.

ఇన్ని రోజులు ఈ దేశం లౌకికదేశంగా వుందంటే, దానికి కారణం ఇక్కడి మెజారిటీ మతంలోనే లౌకికత్వం వుండటమేగాని, అదేదో రాజ్యాంగంలో ప్రకటించేస్తే వచ్చింది కాదు. అలాంటి హిందూ మతమే ఇవాళ తన విశాలత్వాన్నీ, విభిన్నత్వాన్నీ స్వచ్చందంగా వదులుకుని, బలం కోసం ఒక సంకుచిత మూసలోకి ఒదుగుతోంది. ఇన్నాళ్ళు హిందూ మతంగా భావిస్తున్నది నిజానికి మతం కాదు, కాని కొత్తగా ఇప్పుడు పుడుతోంది. తన విశాలత్వానికి మేధావుల దృష్టిలో విలువ లేకపోవటం గమనించి తను కూడా మిగతా మతాల్లాగా మారాలని ప్రయత్నిస్తోంది. భిన్నత్వాన్ని అంగీకరించగలగటమే హిందూమతం యొక్క బలం, అదే దాని బలహీనత కూడా. దాన్ని ఒదులుకుంటే అది తనలోని ఎన్నో బలహీనతలను అధిగమించగలదు. కానీ భిన్నత్వాన్ని అంగీకరించగల దాని స్వభావమే, ఈ దేశ లౌకికత్వనికి రక్ష. అది గమనించకుండా దాని బలహీనతల పైన దాడికి దిగటం ప్రమాదకరం. అటువంటి చేష్టల పర్యవసానమే, అతివాదులకు పెరుగుతున్న ఆదరణ. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనన్న మెసేజ్ జనాల్లోకి వెళ్ళనంత వరకు, వూరికే లౌకికత్వమని, ఇంకోటని గొంతు చించుకుని అరిచినా ఏమీ లాభం ఉండదు.


Friday, April 25, 2008

గ్రంధాలయాలు - నా పుస్తక పఠనం

గ్రంధాలయం అంటే నాకు మొదట గుర్తొచ్చేది మా ఇల్లే. ఇంటి నిండా పుస్తకాలతో అదో చిన్న లైబ్రరీలా వుండేది. మా ఇంట్లో దాదాపు అందరూ పుస్తకాల పురుగులే. ప్రతి వారికి వారి వారి అభిరుచిని బట్టి పుస్తకాల కలెక్షన్ వుండేది. పుస్తకాల మధ్య పెరగటం వల్లనేమో నాకు చదవటం వ్యసనమైపోయింది. నాకు తరగతి పుస్తకాలు చదవాలంటే ఎంత చిరాకో, మిగతా పుస్తకాలు చదవాలంటే అంత ఇష్టం. నా పుస్తక పఠనం చందమామ పుస్తకాలతో మొదలయ్యింది. మా ఇంట్లో చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, రామక్రిష్ణ ప్రభ లాంటివి తెప్పించేవాళ్ళు. అప్పట్లో ప్రతి వేసవి సెలవలకు అమ్మమ్మ వాళ్ళ వూరికి వెళ్ళేవాళ్ళం. అది క్రిష్ణా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అక్కడ కొత్త పుస్తకాలు దొరికేవి కాదు. నా బాధ పడలేక మా తాతయ్య బయటికెళ్ళినప్పుడు పక్కనే వున్న వీరంకిలాకు సెంటర్ నుంచి అనుకుంటా కథల పుస్తకాలు తెచ్చేవారు. ఒకసారి పక్కనే మా పిన్ని వాళ్ళ వూరైన అగినిపర్రు వెళ్తే, నా సంగతి విన్న మా బాబాయి నన్ను ఆ వూరు పంచాయితి గ్రంధాలయంలో అప్పచెప్పేసారు. అక్కడ చందమామ, బాలజ్యోతి పుస్తకాలు పది సంవత్సరాలవి వుండేవి. నేను ఆత్రంగా వాటి మీద పడిపోయి వున్న వారం రోజుల్లో అన్నీ ముగించేసాను. ఎత్తిన పుస్తకం దించకుండా చదివేసి, మళ్ళీ బోర్ అని ఇంట్లో వాళ్ళని విసిగించే నాకు పుస్తకాలు సప్లై చెయ్యటం పెద్ద సమస్య మా ఇంట్లో. నాకోసం వూరంతా గాలించి, తెలిసిన వారందరి ఇళ్ళలోంచి పుస్తకాలు తెప్పించేవారు. అలా రామాయణం, ఉషశ్రీ మహాభారతము, భాగవత కథలు సెలవుల్లో లాగించేసాను. అప్పట్లో కథల పుస్తకాలు పెద్ద వ్యసనం నాకు. ఎంత వ్యసనం అంటే ఎప్పుడూ అవే చదువుతున్నానని మా నాన్న వాటిని అటక మీద దాచేస్తే, పైకి ఎక్కబోయి క్రిందపడి చేయి విరగ్గొట్టుకునేంతగా. చేయి విరిగాక, ఇంట్లో తిట్లు తిన్నాక, ఐదో తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో ఒక సబ్జెక్ట్ తప్పాక, జోరు తగ్గించక తప్పలేదు.

మళ్ళీ తొమ్మిదో తరగతిలో అనుకుంటా, అదే వూపులో చదవటం మొదలెట్టాను. తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర ఒక రీజినల్ లైబ్రరీ ఉండేది. ఖాళీ దొరికినప్పుడు అక్కడికెళ్ళేవాడిని. ఒక టైములో ఫిలాసఫీ మీదకు మళ్ళాను. ఒక యోగి ఆత్మ కథతో మొదలు పెట్టి ఆధ్యాత్మిక పుస్తకాల మీద పడ్డాను. యోగానికి, ధ్యానానికి సంబంధించిన పుస్తకాలకు ఆ లైబ్రరిలో ఒక ప్రత్యేక సెక్షన్ ఉండేది. రామక్రిష్ణ పరమహంస, వివేకానందుల జీవిత చరిత్రలు అక్కడే చదివాను. ఆ లైబ్రరి చాలా పాతగా దయ్యాల కొంపలా ఉండేది. నేను గుహల్లో నిధి కోసం వెతుకుతున్నట్లు, లోపలెక్కడో చీకట్లో వుండే సెక్షన్లలో పాత పుస్తకాలు చూస్తుండేవాడిని. అలా పాత పుస్తకాలతో స్నేహం చెయ్యటంతో పాటూ, డస్ట్ అలెర్జీతో కూడా స్నేహం చెయ్యాల్సి వచ్చింది. ఇవి కాక ఇంట్లో మా తాతగారి కలెక్షన్ లోంచి రవీంద్రనాథ్ టాగూర్ గోరా, బడా దీది లాంటి బెంగాలి అనువాదాలు, వేమన పద్యాలు, కూనలమ్మ పదాలు, ఇంకా మహాసేనాని లాంటి తెలుగు నవలలు చదివాను. నేను ఇంటర్లోకి వచ్చి ఎంసెట్ పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి రావటం, ఆ గ్రంధాలయం మూసెయ్యటం ఒకేసారి జరిగాయి.

ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో నా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాను. ఈసారి నాకు పుస్తకాలు సరఫరా చేసే బాధ్యత ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా వుండే సెంట్రల్ లైబ్రరీ తీసుకుంది. దేవస్థానం వారు నిర్వహించే ఆ గ్రంధాలయం చాలా పెద్దదిగా, విశాలంగా వుండేది. అప్పుడప్పుడు మధ్యానం పూట ఫాన్ కింద పడుకోటానికి వచ్చే ఒకరిద్దరు తప్ప దాదాపు నిర్మానుష్యంగా వుండేది. అక్కడ సంస్కృత పుస్తకాలకు ఒక ప్రత్యేక సెక్షన్ వుండేది. దాంట్లోనే భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం చూసాను. మొదట్లో కొన్ని రోజులు ఇంగ్లీషు పుస్తకాలతో పొద్దుపుచ్చాను. జీరో బయోగ్రఫీ, స్టోరి ఆఫ్ పై లాంటి పుస్తకాలు అక్కడే చదివాను. అప్పట్లో నాకు చరిత్ర గురించి తెలిసింది బహు తక్కువ. స్కూల్లో వున్నప్పుడు నాకు చరిత్ర అంటే చాలా చిరాకు వుండేది. అసలే జ్ఞాపక శక్తి తక్కువ, ఇక ఆ సంవత్సరాలు అవి గుర్తుపెట్టుకోటం చాలా కష్టంగా వుండేది. ఈ గ్రంధాలయానికి రావటం మొదలుపెట్టాక తెలుగు సెక్షన్లో నాకు ప్రతిసారి తెన్నేటి సూరి రాసిన చెంఘిజ్ ఖాన్ పుస్తకం కనిపించేది. అట్ట మీద చైనీయుడి బొమ్మ చూసి ఆసక్తి రాక వెనక్కి పెట్టేసేవాడిని. ఒకసారి టీవీలో బాలకృష్ణ ఇంటర్వ్యూ వస్తుంటే, దాంట్లో మీరు చెయ్యాలనుకునే డ్రీమ్ రోల్స్ ఏంటంటే, చెంఘిజ్ ఖాన్ పాత్ర చెయ్యాలనుందని చెప్పాడు. చెంఘిజ్ ఖాన్ గురించి ఆంత హీరోయిక్ ఏముందో తెలుసుకోవాలనిపించి, తర్వాత రోజు ఆ పుస్తకం చదివాను. చరిత్ర టెక్స్ట్ బుక్ లాగా కాకుండా కథలా చెప్పటం వల్లనేమో నాకు బాగా నచ్చింది. ఆ తర్వత వరసగా చరిత్ర పుస్తకాల మిద పడిపోయాను. రెండో ప్రపంచ యుద్దం గురించిన పుస్తకాలు, హిట్లర్ ఆత్మ కథ(Mein Kampf) లాంటివి చదివాక, తెలుగు వారి చరిత్ర మీదకు వచ్చాను. కాకతీయులు, విజయనగర రాజుల గురించిన పుస్తకాలు కనిపిస్తే వదిలేవాడిని కాదు. చరిత్రతో పాటూ కొంచం మసాలా కలిపి, కల్పిత పాత్రలతో కథలా చెప్పే రచనలు బాగా ఎక్కేవి నాకు. అటువంటి రచనల్లో అడివి బాపిరాజు రాసిన గోన గన్నారెడ్డి పుస్తకం చాలా ఇష్టమైంది నాకు.

ఇంజనీరింగ్ అయ్యాక మాస్టర్స్ కోసం అరవదేశానికి వెళ్ళాల్సి రావటంతో, సెంట్రల్ లైబ్రరీతో కూడా రుణం తీరింది నాకు. అక్కడేమో హాస్టల్లో ఏం చెయ్యాలో తోచేది కాదు. పరీక్షలప్పుడు తప్ప మామూలు రోజుల్లో తరగతి పుస్తకాలు తాకితే కళ్ళు పోతాయనే నమ్మకం వుండే వాళ్ళవటంతో, మా బ్యాచ్ అంతా ఎప్పుడూ గోళ్ళు కొరుకుతూ ఖాళీగా వుండే వాళ్ళం. కొన్నాళ్ళకు వేళ్ళు నెప్పెట్టి మళ్ళీ తెలుగు పుస్తకాల మీదా పడ్డాను. ఇంటికెళ్ళినప్పుడల్లా తిరుపతిలోని విశాలాంధ్ర బుక్ స్టోర్స్ మీద పడి పుస్తకాలు కొనెయ్యటం మొదలు పెట్టాను. చెంఘిజ్ ఖాన్ పుస్తకం లాగే, నాకు ప్రతిసారి గురజాడ వారి కన్యాశుల్కం కనిపించేది. ఆ పేరు వినగానే నాకు పాత సినిమాల్లో ఏడుపు సీన్లు గుర్తుకొచ్చేవి. ఎప్పటిదో పాత దురాచారం గురించి, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాంలే అనుకొని తెరిచేవాడ్ని కాదు. ఒకసారి టీవీలో కన్యాశుల్కం సినిమా చూసిన తర్వాత తెలిసింది నేను ఎంత పొరబడ్డానో అని. కొనుక్కొచ్చి ఏకబిగిన చదివేసాను. సినిమా కంటే నాటకం ఇంకా బావుంది. నేను ఇప్పటి వరకు చదివిన పుస్తకాల్లో, ఎన్నిసార్లు చదివినా విసుగు రాని పుస్తకం అదేనేమో. అప్పట్నుంచి మనసు తెలుగు సాహిత్యం మీదకు మళ్ళింది. మెల్లగా నా హాస్టల్ రూములో ఒక చిన్నపాటి లైబ్రరీ తయారయ్యింది. గురజాడ, శ్రీశ్రీ, చెలం, తాపీ ధర్మారావు లాంటి వారి రచనలు, ముళ్ళపూడి వారి పుస్తకాలు, బాపూ కార్టూన్లు, పసలపూడి కథలు, మధురాంతకం రాజారాం కథలు, ఇలా కాస్త పేరున్న ప్రతి పుస్తకం విశాలాంధ్ర బుక్ షాపులోంచి నా లైబ్రరీకి చేరిపోయాయి. ఇంకా చేరుతూనే వున్నాయి. మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసి నేను సంపాదించుకున్న ఆస్తి, ఈ నా చిన్ని గ్రంధాలయం.


Monday, February 18, 2008

బీహార్ రైల్వే రాజకీయం

ఉత్తర భారత దేశీయులు స్థానికులకు రావలసిన అవకాశాలు చేజిక్కించుకుంటున్నారని నిరసించటం, ఈసారి కన్నడిగుల వంతయ్యింది. ముంబైలో నార్త్ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైందని రాజ్ థాకరే గొడవ మొదలెట్టిన వారంలోనే కర్నాటక రైల్వేలో గ్రూప్ 'D' పోస్టుల భర్తీని కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. ఈ రెక్రూట్‍మెంట్లు కన్నడిగులకు రావలసిన ఉద్యోగాలు బీహారీలకు కట్టబెట్టటానికే జరుగుతున్నాయని వారి అభియోగం.

క్రితం నెలలో సౌత్ వెస్ట్ రైల్వేలో గ్రూప్ 'D' పోస్టుల కోసం నిర్వహించిన ఫిజికల్ పరీక్షలను, 'కర్నాటక రక్షణ వేదిక' జరగకుండా అడ్డుకుంది. పోయిన వారం చిత్రదుర్గలో సమావేశానికి వచ్చిన లాలూ ప్రశాద్ యాదవ్ ముందు ఈ వేదిక నల్ల జెండాలతో తన నిరసన వ్యక్తం చేసింది. దానికి లాలూ జవాబిస్తూ అందరితో పాటూ మెరిట్‍లో ఆ పొస్టులు దక్కించుకోవాలని, స్థానికులకు రిజర్వేషనులు కుదరదని చెప్పారు. దాదాపు కర్నాటకలోనే రైళ్ళు నడిపే సౌత్-వెస్ట్ రైల్వేలో పోస్టులకు, కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ వార్తా పత్రికల్లో మాత్రమే ప్రకటనలు ఇచ్చారు. స్థానిక కన్నడ పత్రికలలో ఈ ప్రకటన రాలేదు. ఇక స్థానికులు మెరిట్‍లో తెచ్చుకోవటం ఎలాగో నాకు అర్ధం కావట్లేదు. అసలు సమానంగా అవకాశం కల్పిస్తే కదా మెరిట్‍తో తెచ్చుకోవటమూ, లేకపోవటమూ. ఈసారి ఈ పరీక్షకు హాజరైన వాళ్ళలో స్థానిక కన్నడిగులు 10 శాతం కంటే తక్కువ. వచ్చిన వారిలో బీహారీలే అత్యధికం. కర్నాటకలో రైల్వే పోస్టులు భర్తీ చెయ్యటం కోసం ఎక్కడో బీహార్ నుంచి బెంగుళూరు, మైసూరు, హుబ్లీలకు రైళ్ళలో అభ్యర్ధుల్ని దింపారు. ఇప్పటికే హుబ్లీలాంటి చోట 80 శాతం రైల్వే ఉద్యోగాలలో బీహారీలే వున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ పోస్టులకు ఎంపిక చేయబడుతున్న వారిలో బీహారీలే అత్యధిక శాతం. మరి స్థానికులకు కడుపు మండకుండా ఎలా వుంటుంది. ఈ గ్రూప్ 'డి' పోస్టులకు( పోర్టర్లు, లైన్‍మెన్ మొదలైనవి) అర్హత కేవలం 8వ తరగతి చదివి వుండటం. వీటిని మెరిట్‍లో దక్కించుకునే పాటి తెలివితేటలు కూడా ఇక్కడి స్థానికులకు లేవని నేను అనుకోను.

కర్నాటకే కాదు, ఆంధ్రాలోనూ రైల్వేలో ఎక్కడ పడితే అక్కడ ఈ బీహారీలే వుంటారు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వుంటే అక్కడికి హిందీ మాట్లాడే జనాలు పెద్ద సంఖ్యలో దిగబడిపోతారు. ఇక బీహారీలకైతే అవకాశాలున్న చోటికి ప్రత్యేక రైళ్ళు నడపబడుతాయి. ఈ హిందీ వాళ్ళ ఆటలు దక్షిణాది రాష్ట్రాల్లో (తమిళనాడు మినహాయించి) సాగినంతగా మిగతా రాష్ట్రాల్లో సాగవేమో. ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికైనా మిగతా రాష్టాల వారు పరీక్షకి కూర్చోలేరు. పరీక్ష రోజు రైలు దిగీ దిగగానే, కొట్టి మరీ అదే రైల్లో వెనక్కి పంపిస్తారు కళింగసేన కార్యకర్తలు. మళ్ళీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిండా వీళ్ళే వుంటారు. రాజ్యాంగం భారతీయిలందరికి దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకునే హక్కుని ప్రసాదించిందని గొంతు చించుకునే జాతీయవాదులెవరైనా ఒక్కసారి ఒరిస్సాలోనో, బీహార్లోనో ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తే తెలుస్తుంది. వాళ్ళ భ్రమలు రైల్వే స్టేషన్‍లోనే తొలగిపోతాయి.

కర్నాటకలో భర్తీ చేసే గ్రూప్ 'డి' పోస్టులాంటి క్రింది స్థాయి ఉద్యోగాలను, కన్నడిగులకు రిజర్వ్ చేయాలని కర్నాటక రక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. కన్నడిగుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే ఈ వేదిక ఇతర డిమాండ్ల గూర్చి నాకు పూర్తిగా తెలీదు కాని, ఇది మాత్రం నాకు సమంజసంగానే అనిపిస్తోంది. పెద్ద పోస్టులకు ఎక్కువ అర్హతలు వుండాలి కాని, గ్రూప్ 'డి' పోస్టుల్లో పని చేసే వారికి ఇంగ్లీష్/హిందీ రావలసిన అవసరం ఏముంది?

రైల్వే ఏదో లాలూ గుత్త సొతైనట్లు బీహారీలకే ఉద్యోగాలిస్తుంటే, ఏమని అడిగే దమ్ము లేదు మన దిక్కుమాలిన పాలకులకు. కర్నాటకలో పాలకులు ఎలా వున్నా, తమ భాష వారికి అన్యాయం జరిగితే నిలదీయటానికి ఒక వేదికైనా వుంది. మనకు అదీ లేదు.


Tuesday, November 20, 2007

తెలుగువారి టైమ్‍పాస్ - సినిమాలు

మనవాళ్ళకు సినిమాలు జీవితంలో ఒక భాగం. ఏ ప్రాంతానికెళ్ళినా కాస్త ఉప్పూ కారం వుండే తిండి, సినిమాలు వుంటే చాలు. మిగతా రాష్ట్రాల్లో జనానికి ఖాళీ దొరికితే పర్యాటక ప్రదేశాలకు వెళ్తారు, ఆటలు ఆడతారు, పిల్లల్తో గడుపుతారు, మరీ బాగుపడే లక్షణాలు వుండే వాళ్ళైతే పుస్తకాలు చదువుకుంటూనో, సంగీతం వింటూనో గడుపుతారు. కాని మనవాళ్ళు మాత్రం సినిమాకి వెళ్తారు. కుదరని వాళ్ళు టీవిల ముందు కూర్చుని ఏ సినిమా వేస్తే అది చూసేస్తారు. చిన్నప్పట్నుంచి తరగతి పుస్తకాలు చదవటం, ర్యాంకులు తెచ్చుకోటం తప్ప, కనీసం ఆటల్లాంటివి (క్రికెట్ తప్ప, అది కూడా చూడటం, ఆడటం కాదు) కూడా అలవాటులేకపోవటంతో, చదువు కాకుండా ఏం చెయ్యాలో పెద్దగా తెలీదు మనకి. కాబట్టి సినిమానే దిక్కు. అది ఎలాంటి సినిమా ఐనా సరే. చూసేది పొద్దుపుచ్చటానికి కదా, ఎలా వుంటే ఏమిటి? పక్క రాష్ట్రాల్లో బొక్కబోర్లా పడ్డ చిత్రాలు కూడా చూసేస్తారు. అందుకే అలాంటి చిత్రాలు కూడా మన దగ్గర కనీసపు వసూళ్ళు దక్కించుకుంటున్నాయి. డబ్బింగ్ ఖర్చులు కంటే కాస్త ఎక్కువ వచ్చినా చాలని నానా చెత్తా డబ్బింగ్ చేసి వదిలేస్తున్నారు. మనవాళ్ళకు సినిమాల విషయంలో భాషా భేధాల్లేవని వాళ్ళకి తెలుసు. వాటినే తెలుగులో రీమేక్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా చూసేస్తారు. ఒకే సినిమాని ఇన్ని భాషల్లో చూడగల సత్తా మనకే వుంది. అందుకే హైదరాబాద్ ఆర్.టీ.సి క్రాస్ రోడ్స్ ఎప్పుడూ పుణ్యక్షేత్రాల రద్ధీతో వుంటుంది. బాంబులు పేలినా సెకండ్ షోకి వచ్చే జనాలు తగ్గరు. షో క్యాన్సిల్ చేస్తే తప్ప. కొత్త సినిమాలు ఏమొచ్చాయిరా అనే మాట కుర్రాళ్ళ మధ్య మామూలుగా వినిపిస్తుంటుంది. ఏమొచ్చినా చూసేద్దామని. ఎలా వున్నా చూసేస్తారనే ధైర్యంతోనే మనవాళ్ళు అద్భుత చిత్రరాజాలు తీసి, మన మీదకు మొహమాటం లేకుండా వదిలేస్తుంటారు. మనమూ వాళ్ళ నమ్మకం వమ్ము చేయకుండా కనీసపు వసూళ్ళు ఇప్పించేస్తాం.

ఇక పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులకు పిచ్చ టైమ్‍పాస్ అవుతుంది. సినిమా కాస్త బాగుంటే(అభిమానులకి బాగుంటే) చాలు, మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుంటారు. ఇంక వీరాభిమానులు అందుకోసమే ఆడియో విడుదల నుంచే డబ్బులు ఆదా చేస్తుంటారు. ప్రతి రోజు వెళ్ళి థియేటర్ దగ్గర కలక్షన్లు లెక్క చూసుకు వస్తుంటారు. మా వూరులాంటి చిన్న టౌన్లలో పెద్ద సినిమాలు విడుదలైన మొదటి వారంలో, వూర్లోని సగం థియేటర్లలో ఆడించేస్తారు. ఆ వారంలో మొత్తం జనం చూసేసాక, ఇంక దాన్ని వంద రోజులకి ఆడించే బాధ్యత ఫాన్స్ తలకెత్తుకుంటారు. చేసిన వాళ్ళ కంటే, తీసిన వాళ్ళ కంటే, వీళ్ళు ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతారు. ఇక ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఇంక ఆ సందడి చెప్పనక్కర్లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బ్యానర్లు, ఒకరికొకరు పోటిగా కటౌట్లు పెట్టటాలు, పగలగొట్టటాలు, తగలబెట్టటాలు, లాఠీచార్జులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. రెండు పక్కల వాళ్ళకీ టైమ్‍పాస్. తమ హీరో సినిమా అద్భుతంగా వుందని, అవతలి సినిమా తేలిపోయిందని జనాల్ని నమ్మించటానికి అభిమానులు గట్టిగా ప్రయత్నిస్తుంటారు. తమ హీరో సినిమా గురించి కంటే, అవతలి వాళ్ళ సినిమా ఎక్కడ బావుంటుందో అని ఎక్కువ కంగారు పడిపోతుంటారు. వీళ్ళ ఫాన్స్ షోల్లోకి వాళ్ళు, వాళ్ళ ఫాన్స్ షోల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి, బయటకి వచ్చి అబ్బే అంత సీన్ లేదు అని పెదవి విరుస్తుంటారు. డబ్బులు పెట్టి వచ్చిన సినిమా బాలేదని సంతోషించే సందర్భం అదేనేమో. సినిమాలో వినోదం కంటే బయట ఇలాంటి వినోదాలు ఎక్కువుంటాయి పెద్ద హీరోల సినిమాలకు. అవి ఆడుతున్నన్ని రోజులూ అభిమానులకు బోర్ అనేది వుండదు.

ఇంక నాలాగా పరిక్షల ముందు రోజు తప్ప మిగతా అప్పుడు పుస్తకం పట్టుకునే అలవాటు లేని వాళ్ళకు, సినిమా చూడటమనేది రోజూ భోజనం చేసినట్టు. కాలేజీలో వున్నప్పుడైతే ఎవడో ఒకడు ఉబుసుపోక థియేటర్ వైపుకు వెళ్ళి టికెట్లు కొనేసి తర్వాత అందరిని పిలిచేవాడు. మేము, ఏం సినిమా అని కూడ అడగకుండా పోలోమని వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళాక థియేటర్ ముందు నుంచుని ఆ సినిమాకు వచ్చినందుకు సాకులు వెతుక్కునే వాళ్ళం. మంచి డైరెక్టర్ అనో, హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అనో, హీరోయిన్ బావుందనో, ఏదో చచ్చు సాకు వెతుక్కుని, మాకు మేమే సమాధానపరచుకునే వాళ్ళం. సినిమాలో చిరంజీవి కటౌట్ చూపించాడనో, పోస్టర్ చూపించాడనో వెళ్ళి చూసిన రోజులు కూడా వున్నాయి. నేను మొదట్లో, మా బ్యాచ్ మాత్రమే ఇలా వుందనుకున్నా, మెల్లగా తెలిసొచ్చింది, మన రాష్ట్రంలో చాలా మంది ఇంతేనని, సినిమాలు మన జాతీయ టైమ్‍పాస్ అని. ఆ మధ్య ఐఐటీలో చదివే మిత్రుడొకడ్ని క్లాస్‍మేట్స్ ఫుట్‍బాల్ ఆడటానికి పిలిస్తే, ఆటెందుకు టైమ్ వేస్ట్, ఆ టైమ్‍లో ఒక సినిమా చూడచ్చు అని చెప్పి, మిగతా రాష్ట్రాల వాళ్ళను కంగు తినిపించాడు. మన వాళ్ళ సినిమా పిచ్చి లోకవిదితం. కన్నడ, తమిళ దేశాల్లో, తెలుగు వారంటే కారం ఎక్కువ తింటారు, సినిమాలు ఎక్కువ చూస్తారు అనే అభిప్రాయం స్థిరపడిపోయింది.

మనవాళ్ళకు సినిమా చూసాక దాని మీద తమ అభిప్రాయం ఎవరికో ఒకరికి చెప్పకపోతే నిద్ర పట్టదు. అది ఇంకో రకం టైమ్‍పాసు. ఆంధ్రాలో ప్రతి రెండో వాడూ కవేనని ముళ్ళపూడి వెంకటరమణగారి వెక్కిరింత. కవి మాటేమోగాని ఆంధ్రాలో ప్రతివాడూ సినీ విమర్శకుడే. అభిమానులు సినిమా ప్రమోషన్లో బిజిగా వుంటే, మిగతా వాళ్ళు తమ సినీ సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శించటంలో బిజీగా వుంటారు. సినిమా బాలేకపోతే ఎందుకు బాలేదో, బావుంటే ఎందుకు బావుందో, ఎక్కడ లోపముందో, ఎక్కడ ఇంకా బాగా తీయచ్చో, తమ సుదీర్గ సినీ వీక్షణానుభవం ఉపయోగించి ఎవరూ అడగకపోయినా అమూల్యమైన అభిప్రాయాలు సెలవిస్తుంటారు. స్క్రీన్‍ప్లే అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఆ పదాన్ని విరివిగా వాడేస్తుంటారు. స్క్రీన్‍ప్లే వీక్‍గా వుందని, ఫస్ట్ హఫ్‍లో టెంపో సెకండ్ హఫ్‍లో లేదని, ఇంటర్వెల్ బ్యాంగ్ సరిగ్గా కుదర్లేదని, పిక్చరైజేషన్ సరిగ్గా రాలేదని, ఇలా తమకే అర్ధం తెలియని పదాలు వాడేసి, అవతలి వాళ్ళకి విజ్ఞాన ప్రదర్శన ఇస్తుంటారు. 'ఎ' క్లాస్ సెంటర్లో ఎలా ఆడుతుందో, 'బి','సి' సెంటర్లలో ఏమాత్రం కల్లెక్షన్స్ వస్తాయో జోస్యం చెప్పేసి, సినిమా మార్కెట్ పై తమకుగల అవగాహన తెలియపరుస్తుంటారు.

మనవాళ్ళని ఎవరైనా అజ్ఞానం కొద్దీ, మీ హాబీస్ ఏమిటని అడిగితే రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అని ఆంగ్లంలో అనేస్తారు గాని, ఎక్కువమంది తినటం, ఇంజనీరింగ్ చదివెయ్యటం, సినిమాలు చూడటం ఇంతే. మన రాష్ట్రంలో ఇవి తప్ప వేరే పనులు చేసేవాళ్ళు వింతజీవుల కింద లెక్క. వాళ్ళని అర్జంటుగా తెలుగేతరులుగా గుర్తించి, వేరే రాష్ట్రాలకు పంపించేసేలా జీవో 610 లాంటిదేదైనా పాస్ చెయ్యాలి.


Monday, October 15, 2007

బెంగుళూరు పుస్తకోత్సవంలో నేను కొన్న పుస్తకాలు

బెంగుళూరులో ప్రతి ఏడాది జరిగే పుస్తకోత్సవం ఈ నెల 12వ తారీకున మొదలయ్యింది. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సుమారు 200 స్టాల్స్ పైగా ఏర్పాటు చేసారు. ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, ఇంకా మన తెలుగు పుస్తకాల స్టాల్స్ వున్నాయి. అన్నిటి కన్నా ఎక్కువ భాగం ఇంగ్లీష్ పుస్తకాలు వుంటే, దాని తర్వాత స్థానం కన్నడ పుస్తకాలు ఆక్రమించాయి. కన్నడ సాహిత్య ప్రముఖుల చిత్రపటాలు, వారి వారి స్వదస్తురితో వ్రాసిన వ్రాత ప్రతులను ప్రదర్సించటానికి ఒక స్టాల్ ని కేటాయించారు. దాని తర్వాత స్థానంలో తమిళ పుస్తకాలు వున్నాయి. అన్నిటి కన్న తక్కువ వున్నవి మన తెలుగు పుస్తకాలే. కేవలం రెండు స్టాల్స్ కి పరిమితం అయ్యాయి. విశాలాంధ్ర పబ్లిషర్స్ వారిది ఒకటి, టాగూర్ పబ్లిషర్స్, హైదరాబాద్ వారిది మరోటి.

నేను, ఇంకా ఇద్దరు మిత్రులు కలిసి వెళ్ళాం అక్కడికి. తెలుగు స్టాల్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళి ఆఖరికి విశాలాంధ్ర స్టాల్లో దూరిపోయాను. లోపలికి వెళ్ళగానే విశ్వనాధ సత్యనారాయణ వారి పుస్తకాలు అన్నీ కలిపి ఒక పెద్ద ప్యాక్ చూపించారు నిర్వాహకులు. నాకు కావలసినవి రెండు వున్నాయి దానిలో. రెండు పుస్తకాల కోసం మొత్తం ప్యాక్ కొని బాదించుకోటం ఎందుకనిపించింది. జేబులో చిల్లర సరిపోదని, ఈసారి వచ్చేటప్పుడు ఇలాంటి తలకు మించిన పధకాలకు ఫండ్స్ ఎలా సమకూర్చాలో రోశయ్యని కనుక్కుని వస్తానని చెప్పి లోపలికెళ్ళాను. స్టాల్ చిన్నదైనా మంచి పుస్తకాలు చాలానే కనిపించాయి.

మొదటగా గురజాడ రచనలు దొరికాయి. వారి కథానికలు, గిడుగు రామ్మూర్తి లాంటి సమకాలీనులతో జరిపిన ఉత్తర-ప్రత్యుత్తరాలు వున్నాయి వాటిలో. తర్వాత కొడవగంటి కుటుంబరావు గారి పుస్తకాలు కనిపించాయి. వారు రాసిన వ్యాసాలన్ని వర్గీకరించి మొత్తం ఎనిమిది సంపుటాలుగా చేసారు. సైన్స్ వ్యాసాలు, చరిత్ర వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు మొదలైనవి. వాటిల్లో చరిత్ర వ్యాసాలు కొన్నాను. ప్రాచీన భారతం నుంచి నేటి కుల వ్యవస్థ దాకా అన్ని దశల గురించిన వ్యాసాలున్నాయి. ఈ దశలలో స్త్రీల స్థితిగతుల గురించి స్త్రీ పర్వం అని ప్రత్యేకంగా వున్నాయి. రామాయణ కథలో ఫాసిజంని చూసే కమ్యూనిస్ట్ రచయితల్లో ఈయన ఒకడని, పుస్తకం వెనక వైపు అట్ట మీద చదివితే తెలిసింది. సరే, రంగనాయకమ్మ గారు చెప్పంది, ఈయనేమి చెబుతాడో చూద్దామని కొన్నాను.

కాసేపు వెతికాక నామిని సుబ్రమణ్యం నాయుడు వ్రాసిన మిట్టూరోడి పుస్తకం దొరికింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక పత్రికలో మిట్టూరోడి కథలు చదివినట్టు గుర్తు. మళ్ళీ ఇన్ని రోజులకి దొరికింది. ఆ కథలతో పాటు, అదే రచయత రాసిన సినబ్బ కథలు, మునికన్నడి సేద్యం లాంటివి అన్నీ కలిపిన సంపుటమే ఈ మిట్టూరోడి పుస్తకం. ఇంకాసేపటికి చలం పుస్తకాలు కనపడ్డాయి. చాలా కలక్షన్ వుంది. నా దగ్గర లేనివి చాలా కనిపించాయి. మ్యూజింగ్స్, స్త్రీ, సాహిత్య సుమాలు, ఇంకా ఇతర వ్యాసాలు, నవలలు అన్నీ కలిపి జాబితా తీస్తే మొత్తం పద్నాలుగు పుస్తకాలు తేలాయి. వీటికయ్యే ఖర్చు, వాటిని చదవటానికి వెచ్చించాల్సిన సమయం లాంటివి గుర్తొచ్చినా, మనసు మాత్రం చలం నాయిక లాగా ఎదురు తిరిగింది. కొనాల్సిందేనంది. ఆఖరికి దాని కోరిక ముందు తలవొగ్గాల్సి వచ్చింది. త్రిపురనేని వారి సూతపురాణం కోసం వెతికాను. దొరకలేదు.

అక్కడితో బరువైన విషయాలున్న పుస్తకాలు కొనటం ఆపేసి హస్యం మీద పడ్డాను. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతి వారం వచ్చిన మృణాలిని గారి శీర్షికల సంపుటి 'తాంబూలం', తెలుగు ప్రముఖుల చతురోక్తులకి, బాపు గారి చిత్రోక్తులు జోడించిన శ్రీరమణ గారి హస్యజ్యోతి, ఇంకా కొన్ని హస్య కథల పుస్తకాలు కొన్నాను. ముళ్ళపూడి వారి బుడుగు కనిపించింది. అది నా దగ్గర వుంది. కాని అదేంటో దాన్ని షాప్ లో ఎప్పుడు చూసినా మళ్ళీ కొనాలని మనసు టెంప్ట్ అవుతుంది. ఆ పుస్తకాన్ని అక్కడ వుంచి కొనకుండా దాని చుట్టు పక్కల తిరిగే జనాన్ని చూస్తే, ఎంత మిస్ అవుతున్నారో అనిపిస్తుంది. నా మిత్రుడొకడ్ని కొనమని ప్రోత్సహించాను. నా ప్రోత్సాహమే గాని వాడిలో ఉత్సాహం కలగలేదు. మంచి పుస్తకం చదవటానికి కూడా జాతకంలో రాసుండాలి కాబోలు. పాపం, ఇలాంటి దురదృష్ట జాతకులందరు ఆంధ్రాలోనే పుడుతున్నారని జాలి వేసింది.

వచ్చే ముందు పానుగంటి వారి సాక్షి వ్యాసాల సంపుటి కనిపించింది. మనసు దాని వైపు గట్టిగా లాగింది గానీ, అప్పటికే పెట్టిన ఖర్చు సహస్రం దాటటంతో మనోనిగ్రహం సాధించవలసి వచ్చింది. నాకు మామూలు సమయాల్లో, నేను మంచి ఉద్యోగం చేస్తున్నట్టు, బాగా సంపాదిస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, పుస్తకాల షాపు‌లోకో, సీడీ షాపు‌లోకో వచ్చినప్పుడు మాత్రం, నేను కటిక పేదరికం అనుభవిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. షాప్‌లోకి దూరి, జేబు తడుముకోకుండా, సంకోచించకుండా నచ్చిన పుస్తకాలు ఎప్పుడు కొంటానో ఏమిటో.

బయటకి వచ్చేసరికి ఫలహరశాల కనిపించింది. అప్పటి వరకు, ఏంటి వీడి పుస్తకాల గోల అని చిరాగ్గా వున్న నా మిత్రులు కాస్త సంతోషించారు దాన్ని చూసి. దాంట్లోకి దూరి కాస్త కతికాము. ఐటమ్స్ ఛండాలంగా వున్నాయి. లోపల షాపులో పెట్టిన ఖర్చు కంటే, ఫలహరాలకు పెట్టిన ఖర్చు దుబారాలా అనిపించింది. మొత్తానికి బోల్డన్ని పుస్తకాలతో ఇల్లు చేరాను. ఇంకొన్ని నెలల వరకు పుస్తకాల షాప్ వంక చూసే పని లేదు.