ఇన్నాళ్ళూ మనకు తీవ్రవాదం అంటే ఇస్లామిక్ తీవ్రవాదమే గుర్తొచ్చేది. ఇప్పుడు కొత్తగా హిందూ తీవ్రవాదం మొదలయ్యింది. గుజరాత్ మారణకాండలోను, ఒరిస్సా మతఘర్షనల్లోను వీరు తమ ఉనికిని బలంగా చాటుకున్నారు. ఇవి చెదురుమదురు సంఘటనలే అనుకోటానికి లేదు. ఈ దాడులు గమనిస్తే ఇవి పక్కా ప్రణాళిక ప్రకారం చేసినవని తెలుస్తుంది. ఇంత ప్రణాళికాబద్దంగా జరిగే హింసని తీవ్రవాదమనే అనాలి. దీన్నీ మిగతా మత తీవ్రవాదాలతో సమానంగా పరిగణించి ఖండించాలి అనటంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు. కానీ అసలు గొడవ ఎక్కడ మొదలౌతుందంటే, ఈ దాడుల్ని తీవ్రవాదంగా భావించి ఖండించే మేధావులు, మిగతా మతాలు చేస్తున్న హింసకి మాత్రం కారణాలు వెతుక్కుని, వారి ఆవేశాన్ని సానుభూతితో పరిశీలించాలని చెప్పటం దగ్గర. మాటకు పదిసార్లు లౌకికత్వం గురించి మాట్లాడే మన ప్రభుత్వము, మన మేధావి వర్గము, నిజంగా అలాగే ప్రవర్తించుంటే ఈ కొత్త తీవ్రవాదం పుట్టక పోయుండేదని నా నమ్మకం.
ఎలాంటి తీవ్రవాదులకైనా జనాల సహకారం ఎంతో కొంత లేకుండా కార్యకలాపాలు చెయ్యటం కష్టం. నేను, ఈమధ్య వరకు కూడా హిందూ ఓటు బ్యాంకు, హిందూ తీవ్రవాదం అనేవి సాధ్యం కావని అనుకునేవాడిని. ఎందుకంటే ఇవి రెండూ కుదరాలంటే ఆ మతం చాలా వ్యవస్థీకృతమైనదిగా వుండాలి. హిందూ మతం శతాబ్దాలుగా ఎన్నో విభిన్న శాఖలుగా చీలి, ఎన్నో కొత్త భావాల్ని కలుపుకుని, ఎన్నో పరస్పర విరుద్దమైన విషయాలను తనలోకి ఇముడ్చుకుని, ఒక జీవన విధానంగా అవతరించింది. అది ఒక మతానికుండే నిర్మాణాన్ని(structure) ఎప్పుడో పోగొట్టుకుంది. నిజానికి దాన్ని ఒక మతమనటమే తప్పు. మతం ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించలేదు. ఇంత చిందరవందరగా ఎవరికి వారుగా బ్రతికే గుంపులోంచి చాలా ఆర్గనైజ్డ్‍గా, నిర్ధిష్టమైన లక్ష్యం కోసం పని చేసే తీవ్రవాదం పుట్టడము, నిలదొక్కుకోవటమూ కష్టం. కానీ ఇప్పుడు మొదలయ్యింది. అందుకు నాకు తోచిన కారణాలు ఇవి.
ఈ దేశంలో మిగతా మతాలతో పోలిస్తే హిందువుల్లో తమ మతం గురించిన పట్టింపులు మొదట్నుంచి తక్కువ, పరమత సహనం ఎక్కువ. కానీ ఈ మధ్య కాలంలో సామాన్య హిందువుల్లో కూడా మతాభిమానము, మనమంతా హిందువులం అనే భావనా పెరిగింది. విభిన్న కులాలుగా, విభిన్న ఆచారాలతో బ్రతుకుతున్న వీరిని గుంపుగా చేరుస్తున్నదేమిటో గమనిస్తే అది వారి మతమూ, ఫిలాసఫీ కంటే, పక్క మతాల పై పెరుగుతున్న నిరసన, కోపం ఎక్కువగా కనిపిస్తుంది. హిందువులుగా చెప్పబడుతున్న ఈ వైవిధ్యమైన గుంపు ఎప్పుడూ proactiveగా ఒక్కటవ్వలేరు, కేవలం reactiveగానే ఒక్కటిగా కలవగలరు. మిగతా మతాల వారిలా proactiveగా కలిసుండటానికి వీరికి కారణాలు బహుతక్కువ. ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఐకమత్యం కూడా అలా ప్రతిక్రియ(reactive)గా వచ్చిందే. అందుకు కారణం, తమ దేశంలోనే తమ మత విశ్వాసాలకి అడుగడుగునా సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వారు భావించటం. అది నిజమేనని నిరూపించి, వారిలో మరింత అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్న బాంబు దాడులు, క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సాంస్కృతిక దాడులు, వారిని వెనకేసుకొస్తున్న ప్రభుత్వము, మరియు మేధావి వర్గము.
ఒక పక్క వారంవారం ఠంచనుగా బాంబులు పేలి జనం చస్తుంటే, వాళ్ళవాళ్ళని మన పోలీసులు వేధిస్తున్నారంట, అందుకే కడుపు మండి పేలుస్తున్నారు పాపం, అని సమర్ధించేవారు కొందరు. మన మతాన్ని, విశ్వాసాల్ని కించపరుస్తున్నారు అంటే, మతప్రచారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, పక్క మతాల్ని తప్పుపట్టకుండా మతప్రచారం ఎలా చేసుకుంటారు పాపం, మనమే సర్దుకోవాలి అని వెనకేసుకొచ్చేవారు ఇంకొందరు. తప్పు ఎవరు చెసినా ఒకటే, అని ఖండిస్తే చల్లారిపోయే దానికి, మనం చెయ్యలేదా, మనలో లేదా అని ఎదురుదాడికి దిగి మరింత నిప్పు రాజేస్తారే కానీ, వారికి అవి తప్పుగా కనిపించవు. ఈ మేధావి వర్గం రెండు వైపులా ఖండించటం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఏకపక్ష ఖండనే. హైందవేతరుల తప్పుల్ని ఖండించాల్సొచ్చినప్పుడు కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడరు. ఈ రకంగా మైనారటీలను చంకనేసుకుని గారాభం చేసే వాళ్ళున్నంత కాలం ఈ సమస్య పరిష్కారం అవ్వదు.
హిందువుల్లో ఈ అతివాద గ్రూపులు ఎప్పట్నుంచో వున్నాయి కానీ ఇన్ని రోజులు వాటికి సామాన్య జనాల సపోర్టు, సానుభూతి లేదు. పైగా వ్యతిరేకత వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అసలు బీజేపీకి దక్షిణ భారతదేశంలో అడుగు పెట్టటం సాధ్యమవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ జరిగింది. ఈ అతివాద గుంపులను ఇన్ని రోజులు అడ్డుకున్నది, వ్యతిరేకించినది కూడా మితవాద హిందువులే. ఇప్పుడు వారే పక్కకి తప్పుకుని అతివాదులకు దారి వదిలేస్తున్నారు. తమ మతం పై జరుగుతున్న సాంస్కృతిక, భౌతిక దాడుల పట్ల వారి అసంతృప్తి, అతివాదులకు ఇంధనంగా మారుతోంది. ఏ మతంలో ఐనా తీవ్రవాదులు తమ చర్యలకు ఏదో ఒక కారణాలు చూపిస్తూనే వుంటారు. వీరికి సామాన్యుల నుంచి సానుభూతి దొరకటం ప్రమాదకరమైన విషయం. నిన్న మొన్నటి వరకు హిందూ అతివాదుల చర్యలకు చిరాకుపడ్డ హిందువులు కూడా, ఇప్పుడు "అలాంటి అతిగాళ్ళకు పోటీగా, ఇలాంటి అతిగాళ్ళు వుండాల్లే, లేకపోతే ఇంకా రెచ్చిపోతారు" అనటమే, వారికి సానుభూతి పెరుగుతోందనటానికి సాక్ష్యం. తమకు పెరుగుతున్న సపోర్ట్ గమనించే, వారు కూడా ఇష్టానుసారం భారీ దాడులకు దిగుతున్నారు.
ఇన్ని రోజులు ఈ దేశం లౌకికదేశంగా వుందంటే, దానికి కారణం ఇక్కడి మెజారిటీ మతంలోనే లౌకికత్వం వుండటమేగాని, అదేదో రాజ్యాంగంలో ప్రకటించేస్తే వచ్చింది కాదు. అలాంటి హిందూ మతమే ఇవాళ తన విశాలత్వాన్నీ, విభిన్నత్వాన్నీ స్వచ్చందంగా వదులుకుని, బలం కోసం ఒక సంకుచిత మూసలోకి ఒదుగుతోంది. ఇన్నాళ్ళు హిందూ మతంగా భావిస్తున్నది నిజానికి మతం కాదు, కాని కొత్తగా ఇప్పుడు పుడుతోంది. తన విశాలత్వానికి మేధావుల దృష్టిలో విలువ లేకపోవటం గమనించి తను కూడా మిగతా మతాల్లాగా మారాలని ప్రయత్నిస్తోంది. భిన్నత్వాన్ని అంగీకరించగలగటమే హిందూమతం యొక్క బలం, అదే దాని బలహీనత కూడా. దాన్ని ఒదులుకుంటే అది తనలోని ఎన్నో బలహీనతలను అధిగమించగలదు. కానీ భిన్నత్వాన్ని అంగీకరించగల దాని స్వభావమే, ఈ దేశ లౌకికత్వనికి రక్ష. అది గమనించకుండా దాని బలహీనతల పైన దాడికి దిగటం ప్రమాదకరం. అటువంటి చేష్టల పర్యవసానమే, అతివాదులకు పెరుగుతున్న ఆదరణ. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనన్న మెసేజ్ జనాల్లోకి వెళ్ళనంత వరకు, వూరికే లౌకికత్వమని, ఇంకోటని గొంతు చించుకుని అరిచినా ఏమీ లాభం ఉండదు.