Tuesday, November 20, 2007

తెలుగువారి టైమ్‍పాస్ - సినిమాలు

మనవాళ్ళకు సినిమాలు జీవితంలో ఒక భాగం. ఏ ప్రాంతానికెళ్ళినా కాస్త ఉప్పూ కారం వుండే తిండి, సినిమాలు వుంటే చాలు. మిగతా రాష్ట్రాల్లో జనానికి ఖాళీ దొరికితే పర్యాటక ప్రదేశాలకు వెళ్తారు, ఆటలు ఆడతారు, పిల్లల్తో గడుపుతారు, మరీ బాగుపడే లక్షణాలు వుండే వాళ్ళైతే పుస్తకాలు చదువుకుంటూనో, సంగీతం వింటూనో గడుపుతారు. కాని మనవాళ్ళు మాత్రం సినిమాకి వెళ్తారు. కుదరని వాళ్ళు టీవిల ముందు కూర్చుని ఏ సినిమా వేస్తే అది చూసేస్తారు. చిన్నప్పట్నుంచి తరగతి పుస్తకాలు చదవటం, ర్యాంకులు తెచ్చుకోటం తప్ప, కనీసం ఆటల్లాంటివి (క్రికెట్ తప్ప, అది కూడా చూడటం, ఆడటం కాదు) కూడా అలవాటులేకపోవటంతో, చదువు కాకుండా ఏం చెయ్యాలో పెద్దగా తెలీదు మనకి. కాబట్టి సినిమానే దిక్కు. అది ఎలాంటి సినిమా ఐనా సరే. చూసేది పొద్దుపుచ్చటానికి కదా, ఎలా వుంటే ఏమిటి? పక్క రాష్ట్రాల్లో బొక్కబోర్లా పడ్డ చిత్రాలు కూడా చూసేస్తారు. అందుకే అలాంటి చిత్రాలు కూడా మన దగ్గర కనీసపు వసూళ్ళు దక్కించుకుంటున్నాయి. డబ్బింగ్ ఖర్చులు కంటే కాస్త ఎక్కువ వచ్చినా చాలని నానా చెత్తా డబ్బింగ్ చేసి వదిలేస్తున్నారు. మనవాళ్ళకు సినిమాల విషయంలో భాషా భేధాల్లేవని వాళ్ళకి తెలుసు. వాటినే తెలుగులో రీమేక్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా చూసేస్తారు. ఒకే సినిమాని ఇన్ని భాషల్లో చూడగల సత్తా మనకే వుంది. అందుకే హైదరాబాద్ ఆర్.టీ.సి క్రాస్ రోడ్స్ ఎప్పుడూ పుణ్యక్షేత్రాల రద్ధీతో వుంటుంది. బాంబులు పేలినా సెకండ్ షోకి వచ్చే జనాలు తగ్గరు. షో క్యాన్సిల్ చేస్తే తప్ప. కొత్త సినిమాలు ఏమొచ్చాయిరా అనే మాట కుర్రాళ్ళ మధ్య మామూలుగా వినిపిస్తుంటుంది. ఏమొచ్చినా చూసేద్దామని. ఎలా వున్నా చూసేస్తారనే ధైర్యంతోనే మనవాళ్ళు అద్భుత చిత్రరాజాలు తీసి, మన మీదకు మొహమాటం లేకుండా వదిలేస్తుంటారు. మనమూ వాళ్ళ నమ్మకం వమ్ము చేయకుండా కనీసపు వసూళ్ళు ఇప్పించేస్తాం.

ఇక పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులకు పిచ్చ టైమ్‍పాస్ అవుతుంది. సినిమా కాస్త బాగుంటే(అభిమానులకి బాగుంటే) చాలు, మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుంటారు. ఇంక వీరాభిమానులు అందుకోసమే ఆడియో విడుదల నుంచే డబ్బులు ఆదా చేస్తుంటారు. ప్రతి రోజు వెళ్ళి థియేటర్ దగ్గర కలక్షన్లు లెక్క చూసుకు వస్తుంటారు. మా వూరులాంటి చిన్న టౌన్లలో పెద్ద సినిమాలు విడుదలైన మొదటి వారంలో, వూర్లోని సగం థియేటర్లలో ఆడించేస్తారు. ఆ వారంలో మొత్తం జనం చూసేసాక, ఇంక దాన్ని వంద రోజులకి ఆడించే బాధ్యత ఫాన్స్ తలకెత్తుకుంటారు. చేసిన వాళ్ళ కంటే, తీసిన వాళ్ళ కంటే, వీళ్ళు ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతారు. ఇక ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఇంక ఆ సందడి చెప్పనక్కర్లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బ్యానర్లు, ఒకరికొకరు పోటిగా కటౌట్లు పెట్టటాలు, పగలగొట్టటాలు, తగలబెట్టటాలు, లాఠీచార్జులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. రెండు పక్కల వాళ్ళకీ టైమ్‍పాస్. తమ హీరో సినిమా అద్భుతంగా వుందని, అవతలి సినిమా తేలిపోయిందని జనాల్ని నమ్మించటానికి అభిమానులు గట్టిగా ప్రయత్నిస్తుంటారు. తమ హీరో సినిమా గురించి కంటే, అవతలి వాళ్ళ సినిమా ఎక్కడ బావుంటుందో అని ఎక్కువ కంగారు పడిపోతుంటారు. వీళ్ళ ఫాన్స్ షోల్లోకి వాళ్ళు, వాళ్ళ ఫాన్స్ షోల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి, బయటకి వచ్చి అబ్బే అంత సీన్ లేదు అని పెదవి విరుస్తుంటారు. డబ్బులు పెట్టి వచ్చిన సినిమా బాలేదని సంతోషించే సందర్భం అదేనేమో. సినిమాలో వినోదం కంటే బయట ఇలాంటి వినోదాలు ఎక్కువుంటాయి పెద్ద హీరోల సినిమాలకు. అవి ఆడుతున్నన్ని రోజులూ అభిమానులకు బోర్ అనేది వుండదు.

ఇంక నాలాగా పరిక్షల ముందు రోజు తప్ప మిగతా అప్పుడు పుస్తకం పట్టుకునే అలవాటు లేని వాళ్ళకు, సినిమా చూడటమనేది రోజూ భోజనం చేసినట్టు. కాలేజీలో వున్నప్పుడైతే ఎవడో ఒకడు ఉబుసుపోక థియేటర్ వైపుకు వెళ్ళి టికెట్లు కొనేసి తర్వాత అందరిని పిలిచేవాడు. మేము, ఏం సినిమా అని కూడ అడగకుండా పోలోమని వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళాక థియేటర్ ముందు నుంచుని ఆ సినిమాకు వచ్చినందుకు సాకులు వెతుక్కునే వాళ్ళం. మంచి డైరెక్టర్ అనో, హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అనో, హీరోయిన్ బావుందనో, ఏదో చచ్చు సాకు వెతుక్కుని, మాకు మేమే సమాధానపరచుకునే వాళ్ళం. సినిమాలో చిరంజీవి కటౌట్ చూపించాడనో, పోస్టర్ చూపించాడనో వెళ్ళి చూసిన రోజులు కూడా వున్నాయి. నేను మొదట్లో, మా బ్యాచ్ మాత్రమే ఇలా వుందనుకున్నా, మెల్లగా తెలిసొచ్చింది, మన రాష్ట్రంలో చాలా మంది ఇంతేనని, సినిమాలు మన జాతీయ టైమ్‍పాస్ అని. ఆ మధ్య ఐఐటీలో చదివే మిత్రుడొకడ్ని క్లాస్‍మేట్స్ ఫుట్‍బాల్ ఆడటానికి పిలిస్తే, ఆటెందుకు టైమ్ వేస్ట్, ఆ టైమ్‍లో ఒక సినిమా చూడచ్చు అని చెప్పి, మిగతా రాష్ట్రాల వాళ్ళను కంగు తినిపించాడు. మన వాళ్ళ సినిమా పిచ్చి లోకవిదితం. కన్నడ, తమిళ దేశాల్లో, తెలుగు వారంటే కారం ఎక్కువ తింటారు, సినిమాలు ఎక్కువ చూస్తారు అనే అభిప్రాయం స్థిరపడిపోయింది.

మనవాళ్ళకు సినిమా చూసాక దాని మీద తమ అభిప్రాయం ఎవరికో ఒకరికి చెప్పకపోతే నిద్ర పట్టదు. అది ఇంకో రకం టైమ్‍పాసు. ఆంధ్రాలో ప్రతి రెండో వాడూ కవేనని ముళ్ళపూడి వెంకటరమణగారి వెక్కిరింత. కవి మాటేమోగాని ఆంధ్రాలో ప్రతివాడూ సినీ విమర్శకుడే. అభిమానులు సినిమా ప్రమోషన్లో బిజిగా వుంటే, మిగతా వాళ్ళు తమ సినీ సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శించటంలో బిజీగా వుంటారు. సినిమా బాలేకపోతే ఎందుకు బాలేదో, బావుంటే ఎందుకు బావుందో, ఎక్కడ లోపముందో, ఎక్కడ ఇంకా బాగా తీయచ్చో, తమ సుదీర్గ సినీ వీక్షణానుభవం ఉపయోగించి ఎవరూ అడగకపోయినా అమూల్యమైన అభిప్రాయాలు సెలవిస్తుంటారు. స్క్రీన్‍ప్లే అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఆ పదాన్ని విరివిగా వాడేస్తుంటారు. స్క్రీన్‍ప్లే వీక్‍గా వుందని, ఫస్ట్ హఫ్‍లో టెంపో సెకండ్ హఫ్‍లో లేదని, ఇంటర్వెల్ బ్యాంగ్ సరిగ్గా కుదర్లేదని, పిక్చరైజేషన్ సరిగ్గా రాలేదని, ఇలా తమకే అర్ధం తెలియని పదాలు వాడేసి, అవతలి వాళ్ళకి విజ్ఞాన ప్రదర్శన ఇస్తుంటారు. 'ఎ' క్లాస్ సెంటర్లో ఎలా ఆడుతుందో, 'బి','సి' సెంటర్లలో ఏమాత్రం కల్లెక్షన్స్ వస్తాయో జోస్యం చెప్పేసి, సినిమా మార్కెట్ పై తమకుగల అవగాహన తెలియపరుస్తుంటారు.

మనవాళ్ళని ఎవరైనా అజ్ఞానం కొద్దీ, మీ హాబీస్ ఏమిటని అడిగితే రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అని ఆంగ్లంలో అనేస్తారు గాని, ఎక్కువమంది తినటం, ఇంజనీరింగ్ చదివెయ్యటం, సినిమాలు చూడటం ఇంతే. మన రాష్ట్రంలో ఇవి తప్ప వేరే పనులు చేసేవాళ్ళు వింతజీవుల కింద లెక్క. వాళ్ళని అర్జంటుగా తెలుగేతరులుగా గుర్తించి, వేరే రాష్ట్రాలకు పంపించేసేలా జీవో 610 లాంటిదేదైనా పాస్ చెయ్యాలి.


Monday, October 15, 2007

బెంగుళూరు పుస్తకోత్సవంలో నేను కొన్న పుస్తకాలు

బెంగుళూరులో ప్రతి ఏడాది జరిగే పుస్తకోత్సవం ఈ నెల 12వ తారీకున మొదలయ్యింది. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సుమారు 200 స్టాల్స్ పైగా ఏర్పాటు చేసారు. ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, ఇంకా మన తెలుగు పుస్తకాల స్టాల్స్ వున్నాయి. అన్నిటి కన్నా ఎక్కువ భాగం ఇంగ్లీష్ పుస్తకాలు వుంటే, దాని తర్వాత స్థానం కన్నడ పుస్తకాలు ఆక్రమించాయి. కన్నడ సాహిత్య ప్రముఖుల చిత్రపటాలు, వారి వారి స్వదస్తురితో వ్రాసిన వ్రాత ప్రతులను ప్రదర్సించటానికి ఒక స్టాల్ ని కేటాయించారు. దాని తర్వాత స్థానంలో తమిళ పుస్తకాలు వున్నాయి. అన్నిటి కన్న తక్కువ వున్నవి మన తెలుగు పుస్తకాలే. కేవలం రెండు స్టాల్స్ కి పరిమితం అయ్యాయి. విశాలాంధ్ర పబ్లిషర్స్ వారిది ఒకటి, టాగూర్ పబ్లిషర్స్, హైదరాబాద్ వారిది మరోటి.

నేను, ఇంకా ఇద్దరు మిత్రులు కలిసి వెళ్ళాం అక్కడికి. తెలుగు స్టాల్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళి ఆఖరికి విశాలాంధ్ర స్టాల్లో దూరిపోయాను. లోపలికి వెళ్ళగానే విశ్వనాధ సత్యనారాయణ వారి పుస్తకాలు అన్నీ కలిపి ఒక పెద్ద ప్యాక్ చూపించారు నిర్వాహకులు. నాకు కావలసినవి రెండు వున్నాయి దానిలో. రెండు పుస్తకాల కోసం మొత్తం ప్యాక్ కొని బాదించుకోటం ఎందుకనిపించింది. జేబులో చిల్లర సరిపోదని, ఈసారి వచ్చేటప్పుడు ఇలాంటి తలకు మించిన పధకాలకు ఫండ్స్ ఎలా సమకూర్చాలో రోశయ్యని కనుక్కుని వస్తానని చెప్పి లోపలికెళ్ళాను. స్టాల్ చిన్నదైనా మంచి పుస్తకాలు చాలానే కనిపించాయి.

మొదటగా గురజాడ రచనలు దొరికాయి. వారి కథానికలు, గిడుగు రామ్మూర్తి లాంటి సమకాలీనులతో జరిపిన ఉత్తర-ప్రత్యుత్తరాలు వున్నాయి వాటిలో. తర్వాత కొడవగంటి కుటుంబరావు గారి పుస్తకాలు కనిపించాయి. వారు రాసిన వ్యాసాలన్ని వర్గీకరించి మొత్తం ఎనిమిది సంపుటాలుగా చేసారు. సైన్స్ వ్యాసాలు, చరిత్ర వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు మొదలైనవి. వాటిల్లో చరిత్ర వ్యాసాలు కొన్నాను. ప్రాచీన భారతం నుంచి నేటి కుల వ్యవస్థ దాకా అన్ని దశల గురించిన వ్యాసాలున్నాయి. ఈ దశలలో స్త్రీల స్థితిగతుల గురించి స్త్రీ పర్వం అని ప్రత్యేకంగా వున్నాయి. రామాయణ కథలో ఫాసిజంని చూసే కమ్యూనిస్ట్ రచయితల్లో ఈయన ఒకడని, పుస్తకం వెనక వైపు అట్ట మీద చదివితే తెలిసింది. సరే, రంగనాయకమ్మ గారు చెప్పంది, ఈయనేమి చెబుతాడో చూద్దామని కొన్నాను.

కాసేపు వెతికాక నామిని సుబ్రమణ్యం నాయుడు వ్రాసిన మిట్టూరోడి పుస్తకం దొరికింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక పత్రికలో మిట్టూరోడి కథలు చదివినట్టు గుర్తు. మళ్ళీ ఇన్ని రోజులకి దొరికింది. ఆ కథలతో పాటు, అదే రచయత రాసిన సినబ్బ కథలు, మునికన్నడి సేద్యం లాంటివి అన్నీ కలిపిన సంపుటమే ఈ మిట్టూరోడి పుస్తకం. ఇంకాసేపటికి చలం పుస్తకాలు కనపడ్డాయి. చాలా కలక్షన్ వుంది. నా దగ్గర లేనివి చాలా కనిపించాయి. మ్యూజింగ్స్, స్త్రీ, సాహిత్య సుమాలు, ఇంకా ఇతర వ్యాసాలు, నవలలు అన్నీ కలిపి జాబితా తీస్తే మొత్తం పద్నాలుగు పుస్తకాలు తేలాయి. వీటికయ్యే ఖర్చు, వాటిని చదవటానికి వెచ్చించాల్సిన సమయం లాంటివి గుర్తొచ్చినా, మనసు మాత్రం చలం నాయిక లాగా ఎదురు తిరిగింది. కొనాల్సిందేనంది. ఆఖరికి దాని కోరిక ముందు తలవొగ్గాల్సి వచ్చింది. త్రిపురనేని వారి సూతపురాణం కోసం వెతికాను. దొరకలేదు.

అక్కడితో బరువైన విషయాలున్న పుస్తకాలు కొనటం ఆపేసి హస్యం మీద పడ్డాను. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతి వారం వచ్చిన మృణాలిని గారి శీర్షికల సంపుటి 'తాంబూలం', తెలుగు ప్రముఖుల చతురోక్తులకి, బాపు గారి చిత్రోక్తులు జోడించిన శ్రీరమణ గారి హస్యజ్యోతి, ఇంకా కొన్ని హస్య కథల పుస్తకాలు కొన్నాను. ముళ్ళపూడి వారి బుడుగు కనిపించింది. అది నా దగ్గర వుంది. కాని అదేంటో దాన్ని షాప్ లో ఎప్పుడు చూసినా మళ్ళీ కొనాలని మనసు టెంప్ట్ అవుతుంది. ఆ పుస్తకాన్ని అక్కడ వుంచి కొనకుండా దాని చుట్టు పక్కల తిరిగే జనాన్ని చూస్తే, ఎంత మిస్ అవుతున్నారో అనిపిస్తుంది. నా మిత్రుడొకడ్ని కొనమని ప్రోత్సహించాను. నా ప్రోత్సాహమే గాని వాడిలో ఉత్సాహం కలగలేదు. మంచి పుస్తకం చదవటానికి కూడా జాతకంలో రాసుండాలి కాబోలు. పాపం, ఇలాంటి దురదృష్ట జాతకులందరు ఆంధ్రాలోనే పుడుతున్నారని జాలి వేసింది.

వచ్చే ముందు పానుగంటి వారి సాక్షి వ్యాసాల సంపుటి కనిపించింది. మనసు దాని వైపు గట్టిగా లాగింది గానీ, అప్పటికే పెట్టిన ఖర్చు సహస్రం దాటటంతో మనోనిగ్రహం సాధించవలసి వచ్చింది. నాకు మామూలు సమయాల్లో, నేను మంచి ఉద్యోగం చేస్తున్నట్టు, బాగా సంపాదిస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, పుస్తకాల షాపు‌లోకో, సీడీ షాపు‌లోకో వచ్చినప్పుడు మాత్రం, నేను కటిక పేదరికం అనుభవిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. షాప్‌లోకి దూరి, జేబు తడుముకోకుండా, సంకోచించకుండా నచ్చిన పుస్తకాలు ఎప్పుడు కొంటానో ఏమిటో.

బయటకి వచ్చేసరికి ఫలహరశాల కనిపించింది. అప్పటి వరకు, ఏంటి వీడి పుస్తకాల గోల అని చిరాగ్గా వున్న నా మిత్రులు కాస్త సంతోషించారు దాన్ని చూసి. దాంట్లోకి దూరి కాస్త కతికాము. ఐటమ్స్ ఛండాలంగా వున్నాయి. లోపల షాపులో పెట్టిన ఖర్చు కంటే, ఫలహరాలకు పెట్టిన ఖర్చు దుబారాలా అనిపించింది. మొత్తానికి బోల్డన్ని పుస్తకాలతో ఇల్లు చేరాను. ఇంకొన్ని నెలల వరకు పుస్తకాల షాప్ వంక చూసే పని లేదు.


Friday, October 12, 2007

స్వాగతం

నమస్కారం. చైతన్యం అన్న బ్లాగు పేరు చూసి అది ఈ బ్లాగులో వుంటుందనో, లేక నాకు తెగ వుందనో అనుకునేరు. నా పేరులోని చైతన్యం నాలోకి, నా బ్లాగ్ లోకి రావాలని ఆశిస్తూ ఆ పేరు పెట్టానంతే. తెలుగు బ్లాగుల గురించిన చైతన్యం నాకు చాలా మంది కన్నా ఆలస్యంగా కలిగింది. అది నా తల్లోంచి చేతుల్లోకి, దాంట్లోంచి నా మూషికంలోకి రావటానికి ఆరు నెలలు పట్టింది. ఆంధ్రులు ఆరంభ శూరులన్న నానుడికి బలం చేకూర్చటం ఎందుకని, ఖాళీ దొరికినప్పుడు మొదలెడదామని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఖాళీ అనేది బ్రహ్మ పదార్ధమని, అది ఎప్పటికీ దొరకదని ఈమధ్యే జ్ఞానోదయమయ్యింది. అందుకే మొదలెడుతున్నా. చాలా బ్లాగుల్లా ఇది కూడా నాకు నచ్చినవి, నచ్చనివి, చదివినవి, తెలుసుకున్నవి అందరితో పంచుకోవటానికే.



ఇక నా గురించి చెప్పుకుంటే పెద్దగా ఏమి లేదు. తినటం, తొంగోవటం, దొరికిన పుస్తకాలన్ని చదవటం, కనపడ్డ సినిమాలన్ని చూడటం. ఇవి తప్ప, రావుగోపాల్ రావు చెప్పిన కళాపోషణ లాంటివేమి లేవు. తెలుగు భాష మీద అభిమానం కొంచం ఎక్కువ, తెలుగు సాహిత్యం మీద చాలా మక్కువ. అంటే సాహిత్యం గురించి తెగ తెలుసని కాదు, చదవటానికి ఇష్టపడతానని. పుట్టింది కోస్తాలో, పెరిగింది రాయలసీమలో, ప్రస్తుతం సేదతీరుతున్నది బెంగుళూరులో. ఇక మీదట నుంచి క్రమం తప్పకుండా నా ఆలోచనలు, అనుభవాలు అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను.