జాతీయ పార్టీని ఎన్నుకుంటే జరిగేదేమిటో నాలుగు రోజుల్లోనే అనుభవంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల పట్ల తనకు ఉన్న చులకన భావం మరోసారి చూపించింది. 33 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే మనకు సహయమంత్రి పదవులు విదిలించింది. తమిళనాడు, కర్ణాటకలు కేంద్రానికి ఇచ్చింది తక్కువమంది ఎంపీలనైనా ముఖ్యమైన శాఖలు వారు దక్కించుకుంటే, మనవాళ్ళు సహయమంత్రులుగా పదవి ఇచ్చామని మన్మోహనుడు ఫోన్ చేసి చెప్తే ఆనందంతో పొంగి పొర్లుదండాలు పెట్టేస్తున్నారు. ఇలా జరగటం ఇది రెండోసారి. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో రాజీవ్, ఇందిరల నామస్మరణ మారుమ్రోగింది. తెలుగువారిలో గుర్తుంచుకోదగ్గ నాయకులు లేరని, ప్రతి పధకానికీ కాంగ్రెస్ వాళ్ళ అమ్మ మొగుడి పేరు పెట్టుకుంటూ అతి విశ్వాసం చూపిస్తేనే రాలిన మెతుకులివి.
ఇలా చెయ్యటం వాళ్ళకి కొత్త కాదు, మనకు అంతకన్నా కొత్త కాదు. జాతీయ పార్టీలలో రాష్ట్రనాయకులు ఏది కావాలన్నా అధిష్టానాన్ని దేబిరించాలే కానీ డిమాండ్ చెయ్యలేరు. చేస్తే ఉన్న పదవి పోయి పార్టీలో ఉన్న మన ప్రత్యర్థి వర్గాన్ని వరిస్తుంది. రాజశేఖరుడు మన రాష్ట్రం నుండి 33 మంది ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపించింది, మేడం తనను ముఖ్యమంత్రిగా పీకేసి ఇంకో గన్నాయిగాడిని పెట్టకుండా ఉండటానికే కానీ అంతకుమించి మనకేమి తెప్పించటానికి కాదు. ఈసారి ఎలాగూ పూర్తి మెజారిటీ రాదనుకుని ఎన్నికలయ్యాక కడపకి పోయి కూర్చుని, రాజధాని కలరాతో ఏడుస్తున్నా నాకేం సంబంధం లేదన్నట్టు సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ వున్నారు మన రాజావారు. తీరా గెలిచేసరికి ఆనందంతో తబ్బిబ్బయిపోయి ఈ ఆనందం చాలు మాకింకేమి అక్కర్లేదు, ఇంకా ఎక్కువిస్తే మా వాళ్ళకు గుండె ఆగిపోవచ్చు, ఇక్కడ మా వేషాలు చూసీ చూడనట్టు వదిలేసి, అప్పుడప్పుడు వచ్చి పొగడటానికి మాత్రమే ఇంతమంది ఎంపీలను పంపుతున్నాను అని చెప్పినట్టున్నారు అధిష్టానానికి. రేపెప్పుడైనా అధిష్టానం కళ్ళెర్రజేస్తే, మీ కోసం ఇంతమందిని గెలిపించాను, మాకు రావలసిన పరిశ్రమలు, రైళ్ళు, రోడ్లు అన్నీ వదులుకున్నాను, మీ సేవకి మావాళ్ళని సహయమంత్రులుగా పెట్టాను, ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేస్తే నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని, పాత సినిమాల్లో భార్యలు భర్తల్ని నిష్టూరమాడినట్టు, అధిష్టానాన్ని సెంటిమెంట్ డైలాగులతో కొట్టొచ్చు.
ఈ జాతీయ పార్టీలను గెలిపించినంత కాలం మన పరిస్థితి ఇంతేనేమో. తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలను భూస్థాపితం చేసేసి, ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుని, తమకు రావలసినవి డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండటం తప్ప దక్షిణాది రాష్ట్రాలకు వేరే మార్గం లేదు. ఆంధ్రాలో ఆ పని అన్నగారు మొదలుపెట్టి సగం పూర్తి చేసారు, మిగతా పని పూర్తి చెయ్యటానికి "అన్నయ్య" వస్తాడనుకుంటే, ఆయన మొదట్లోనే పూర్తిగా చతికిలబడ్డాడు. బలమైన ప్రాంతీయ పార్టీ ఒక్కటే అవ్వటంతో, అది నచ్చనప్పుడల్లా మళ్ళీ కాంగ్రెస్‌ని ఎన్నుకుని ఇలా ఢిల్లీ వంక చూస్తూ, వాళ్ళు మనకు తప్ప అందరికి పంచుతున్నవి చూసి గుటకలు మింగటం వినా వేరే దారి కనపడదు. మెల్లగా ప్రజారాజ్యం పుంజుకుని, వున్న రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ కాంగ్రెస్ లాంటి పార్టీలకు చోటివ్వకూడదని నా ఆశ. నా ఆశేగానీ జరుగుతున్నవి చూస్తుంటే వచ్చే ఎన్నికలకి ప్రజారాజ్యం అనే పార్టీ వుంటుందో లేదో అని అదో అనుమానం. మిగతా పని పూర్తి చెయ్యటానికి మళ్ళీ అన్నగారే పుట్టాలి కాబోలు.
Thursday, May 28, 2009
మరోసారి మొండిచేయి
రాసినవారు: చైతన్య కృష్ణ పాటూరు సమయం: 3:27 PM 18 అభిప్రాయాలు
Subscribe to:
Posts (Atom)