Saturday, November 8, 2008

రచ్చ గెలిచాం, ఇంట గెలిచేది ఎన్నడో?

ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు భాషాభిమానులు పోరాడిన తర్వాత తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రకటించింది. 2004లో తమిళులు తమ భాషకి ప్రాచీన భాషంటూ ఒక హోదా కట్టబెట్టేవరకు, మనకు కనీసం ఆ ఆలోచన కూడా లేదు. వాళ్ళకివ్వగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి స్లోగన్లివ్వటం మొదలుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం మనల్ని గుర్తించట్లేదని, అరవ మంత్రులు అడ్డుపడుతున్నారని, మన నాయకులు పట్టించుకోవట్లేదని వాపోయాం. ఇన్నాళ్ళూ కదలకుండా ఉన్న కేంద్రం హఠాత్తుగా ఎన్నికల సంవత్సరంలో కదిలింది. మన నాయకులేమో కోర్ట్ లో కేసున్నా పర్లేదంటూ, రాష్ట్రావతరణ దినోత్సవం రోజున ప్రకటన ఇప్పించేసి, మా పని మేం చేసేసాం, మమ్మల్నింక తప్పు పట్టటానికి ఏమీ లేదని చేతులు దులిపేసుకున్నారు. ఈ హోదా వల్ల మనకేం ఉపయోగం, తెలుగు ప్రాచీన భాషైతే ఏంటి, అవ్వకపోతే ఏంటి, నవీన భాష కావాలి కానీ, అని చాలా మంది పెదవి విరిచారు. ఈ వాదనల్లో నిజమున్నా, ప్రాచీన భాష హోదా కోసం చేసిన పోరాటం మరీ అంత అనవసరమైనది కాదని నా అభిప్రాయం. తెలుగుకేదో కొత్త గుర్తింపని కాదుగాని, ఈ ప్రయత్నం తెలుగు భాషాభిమానుల్లో కావలసినంత కదలిక తీసుకువచ్చింది. ఈ నాలుగు సంవత్సరాలూ భాషని గురించిన చర్చలు, వాదాలు ఎడాపెడా చేసాం, విన్నాం. భాష విషయంలో మనది కొంచెం తోలుమందం కాబట్టి, పొరుగువారు వచ్చి వీపు మీద చరిచాక గాని తేరుకోలేదు. మన వాళ్ళకు పోటీ, పోలిక ఉంటే తప్ప సొంత భాషైనా రుచించదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన హోదా తెలుగు భాషకు వచ్చిన గుర్తింపు అనటం కంటే, భాషాభిమానుల్లో పెరిగిన స్ఫూర్తికి గుర్తు అనుకోవచ్చేమో. తెలుగువాళ్ళం చాలా అరుదుగా, అదీ తప్పు చేస్తున్నట్టు సిగ్గుపడుతూ చూపించే మన భాషాభిమానాన్ని నిర్భయంగా అందరికీ ప్రదర్శించటానికి వచ్చిన ఒక సందర్భంగా అనుకోవచ్చు.

ఢిల్లీకెక్కి రచ్చ చేసి రచ్చ గెలిచాం గానీ ఇంట గెలిచే సూచనలు కనుచూపు మేరలో కనిపించటం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాం గానీ, తెలుగువారితో వారి మాతృభాష గొప్పదని, మిగతా ఏ భాషలకూ తీసిపోదని అనిపించలేకున్నాం. మన రాష్ట్రంలో భాషాభిమానులంటే గ్రహాంతరవాసుల క్రింద లెక్క. మనదైన దాన్ని అభిమానించమని ఎవ్వరూ చెవినిల్లు కట్టుకుని పోరాల్సిన అవసరం లేదు. కానీ తెలుగు విషయంలో చెప్పాల్సి వస్తోందంటే కారణం, అది ఈ రోజు తెలుగువారికి పరాయిదైపోవటమే. భాషా, అది నేర్పే సంస్కృతీ, మనలో భాగమైనప్పుడు భాషాభిమానం సహజంగా వస్తుంది. చిన్నప్పట్నుంచీ తల్లి ఒడిలో గోరుముద్దలు తింటూ పెరిగిన పిల్లవాడు తల్లిని సహజంగా, unconditionalగా ప్రేమిస్తాడు కానీ, అదేదో భాధ్యతలానో, పక్కవారి కోసమో ప్రేమించడు. చిన్నప్పుడు చందమామ పుస్తకం ఊహల్లో విహరింపజేస్తుంటే, ఎప్పటికప్పుడు వేమన నీతులు జాగ్రత్తలు చెబుతూ ఉంటే, ఎంకి పాటలు సేదతీరుస్తుంటే, వాగ్గేయకారుల కీర్తనలు నవరసాలు ఒలికిస్తూ మురిపిస్తుంటే, ఇవి అనుభవించిన వారెవరైనా తెలుగెందుకని అడుగుతారా? దాని వల్ల ఉపయోగాలు ఏమీ లేవని ఎన్ని చెప్పినా ఒదులుకుంటారా? తమ పిల్లలకి నేర్పకుండా ఉంటారా? భాష జీవితంలో విడదీయరాని భాగమై పెనవేసుకుపోవాలి. అలా కానప్పుడు అది కేవలం మాట్లాడటానికి ఉపయోగించే ఒక మీడియం అవుతుంది, అంతే. చిన్నతనంలో సరిగ్గా పరిచయం చేస్తే, జీవితాంతం మనల్ని మురిపించి మైమరిపించగల శక్తి తెలుగు భాషకి ఉంది. కానీ అసలు ఇప్పటి పిల్లల కలలోకైనా మనం తెలుగుని రానివ్వటం లేదు. ఇంకది వారిని ఎలా మురిపిస్తుంది, ఎలా వారి జీవితంలో భాగమౌతుంది. భాషైనా, సంస్కృతైనా, మరే భావనైనా, మనలో లేకుండా మన చుట్టూ జీవితంలో ఉంటే దాన్ని మనం అభిమానించకపోగా, చిరాకు పడతాం. ఎందుకంటే అది మనకొక అనవసరపు బరువులా, మనకు ఉపయోగపడని ఒక బాధ్యతలా పరిణమిస్తుంది. మనలో భాగం కానిదేదైనా ఒక అదనపు లగేజ్. చిన్నతనంలో తెలుగులోని తియ్యదనాన్ని రుచి చూసినవారు, పెద్దయ్యాక ఎన్ని భాషలు నేర్చినా, అది బ్రతకటానికి పనికి రాకపోయినా దాని పై అభిమానం పోగొట్టుకోరు. ఇప్పుడు మనం చేయవలసినవి, మారుతున్న పరిస్థితులకు సరిపోయే విధంగా భాషను పరిపుష్టం చేసుకోవటమూ, మన పిల్లలకు ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికీ, దానితో మాట్లాడటానికీ, తియ్యనైన మన భాషను అందించటమూ.

మన తెలుగు భాష గొప్పదని, చరిత్ర గలదని చెప్పుకుంటాం. కన్నడరాయని ప్రశంసల్ని, సుబ్రమణ్యభారతి పొగడ్తల్ని, తెలుగుతల్లి మెడలో దండలుగా వేసి మురిసిపోతాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మరో దండ వేయించాం. ఆమె పాదాల దగ్గర ప్రణమిల్లే భక్తి ప్రపత్తులు లేకుండా కేవలం దండలతోనూ, వంక దండాలతోనూ, సరిపెట్టటం చిత్తసుద్ధి లేని శివపూజ లాంటిది. ఎన్నాళ్ళని పోయిన శతాబ్దపు పాచిపోయిన గొప్పలు చెప్పుకుంటాం. మన భాషకు కొత్త హంగులు దిద్దాల్సిన సమయం వచ్చింది.


6 అభిప్రాయాలు:

Kottapali said...

బాగా చెప్పారు .. అదేదో పాత పాటలో చెప్పినట్టు ..
"అందుకు మనవేం సెయ్యాలో అదిగూడా ఉవ్వే సెప్పూ!"

Anonymous said...

చైతన్య క్రిష్ణ గారూ మంచిమాట చెప్పారు.

నేను దాన్నే ఇంకో కోణంలో వాఖానించడానికి ప్రయత్నిస్తాను.

మనం తెలుగు సంస్కృతితో జీవించాలనుకొంటున్నంత కాలం తెలుగు బ్రతికే ఉంటుంది. స్థానిక జీవనవిధానాలన్నీ ప్రమాదంలో పడ్డాయి. విజ్ఞాన, సంపద, పెట్టుబడుల వినిమయాలు వేగవంతమైనాయి. ఇది సస్టెయినబుల్ కాదన్న విషయాన్ని గుర్తించి స్థానిక సంస్కృతినే జీవన విధానంగా మలచుకొనే స్పృహ వచ్చిననాడు తెలుగు సహజంగా మనగలుగుతుంది. లేకుంటే అది మన నాయకమ్మణ్యుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సి వస్తుంది.

మనలాంటి ఔత్సాహికుల కృషితో కొంత కదలిక వచ్చినా అది జీవనస్రవంతిగా ప్రవహించే వేగాన్ని సంతరించుకోదు.

మాతృభాష పట్ల మన స్పందనలు ఉద్వేగ పూరితస్థాయి నుండి ఎదగాలి. భాషతో పాటుగా జీవనవిధానాలను కూడా సంస్కరించుకోవాలి. కాపాడుకోవాలి.

చైతన్య కృష్ణ పాటూరు said...

@కొత్త పాళీ - నెనర్లు. ఇప్పటి కొత్త తరాల్ని తెలుగుకు దూరం చేస్తున్నవి, తెలుగు నిరుపయోగమైనదనే తృణీకార భావన, ఆ పైన అది నేర్చుకోవటం కష్టమనే ఉద్దేశమూనూ. వీటిని దూరం చేయకుండా ప్రభుత్వం ఏం చేసినా, మనలాంటి భాషాభిమానులు ఎంత గొంతుచించుకున్నా, ఏమీ ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం. మొదటిదానికి తల్లిదండ్రుల ఆలోచనావిధానంలో మార్పురావలసి ఉంది. రెండవదానికి తెలుగు నేర్పే విధానంలో మార్పు రావలసి ఉంది. మొదట్లోనే కఠినమైన పద్యాలతో బెదరగొట్టకుండా, సులువుగా నేర్చుకునేలా తెలుగు పాఠ్యాంశాల సరళీకరించటం ఎక్కువ ఫలితాలనిస్తుందని నా నమ్మకం.

@సీతారాంరెడ్డి - చాలా చక్కగా, క్లుప్తంగా చెప్పారు. మీరన్నట్లు స్థానిక జీవన విధానాలన్నీ ప్రమాదంలో పడ్డాయి. వాటిని రక్షించుకున్న రోజున, వాటితో ముడిపడి ఉన్న భాషా, సంస్కృతీ వాటంతట అవే నిలబడతాయి. మాతృభాషా, సంస్కృతీ విలువలేనివని, చిన్నప్పట్నించీ తెలుగు తగలనీకుండా పాతికేళ్ళు ఇంగ్లీషు మీడియం చదువులూ, ఇంజనీరింగులూ చదివి, విదేశీ కంపెనీలకు పని చేసిపెట్టడానికి కావలసిన అన్ని అర్హతలూ సంపాదించుకుని, వారి భాషలో మాట్లాడుతూ, వారి సమయాల్లో పని చేస్తూ సాధించిందేమిటంటే తుమ్మితే ఊడే ముక్కులాంటి ఉద్యోగం. ఎక్కడ ఎవడి ఆర్థిక వ్యవస్త కాస్త కదిలినా ఇక్కడ భూకంపాలు. పొరుగువారి వాపుని నిజమని నమ్మి, ఉన్న కాస్త సొంత బలుపునీ పోగొట్టుకుంటున్నాం.

విరజాజి said...

మీరన్న మాట చాలా నిజమండీ..!! మన భాష ని నేర్చుకునే అవకాశాలకంటే, తక్కువ చేసే సాధనాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో మనలాటి కొద్ది మంది చెప్పే మాటలు వినేవారు అరుదు. మన భాషకి ఇకనైనా మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం.

చైతన్య said...

మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నాను... బాగుంది!
మీరు ఎక్కువగా బ్లాగ్గింగ్ చేయరనుకుంటాను!

GARAM CHAI said...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai