Tuesday, November 20, 2007

తెలుగువారి టైమ్‍పాస్ - సినిమాలు

మనవాళ్ళకు సినిమాలు జీవితంలో ఒక భాగం. ఏ ప్రాంతానికెళ్ళినా కాస్త ఉప్పూ కారం వుండే తిండి, సినిమాలు వుంటే చాలు. మిగతా రాష్ట్రాల్లో జనానికి ఖాళీ దొరికితే పర్యాటక ప్రదేశాలకు వెళ్తారు, ఆటలు ఆడతారు, పిల్లల్తో గడుపుతారు, మరీ బాగుపడే లక్షణాలు వుండే వాళ్ళైతే పుస్తకాలు చదువుకుంటూనో, సంగీతం వింటూనో గడుపుతారు. కాని మనవాళ్ళు మాత్రం సినిమాకి వెళ్తారు. కుదరని వాళ్ళు టీవిల ముందు కూర్చుని ఏ సినిమా వేస్తే అది చూసేస్తారు. చిన్నప్పట్నుంచి తరగతి పుస్తకాలు చదవటం, ర్యాంకులు తెచ్చుకోటం తప్ప, కనీసం ఆటల్లాంటివి (క్రికెట్ తప్ప, అది కూడా చూడటం, ఆడటం కాదు) కూడా అలవాటులేకపోవటంతో, చదువు కాకుండా ఏం చెయ్యాలో పెద్దగా తెలీదు మనకి. కాబట్టి సినిమానే దిక్కు. అది ఎలాంటి సినిమా ఐనా సరే. చూసేది పొద్దుపుచ్చటానికి కదా, ఎలా వుంటే ఏమిటి? పక్క రాష్ట్రాల్లో బొక్కబోర్లా పడ్డ చిత్రాలు కూడా చూసేస్తారు. అందుకే అలాంటి చిత్రాలు కూడా మన దగ్గర కనీసపు వసూళ్ళు దక్కించుకుంటున్నాయి. డబ్బింగ్ ఖర్చులు కంటే కాస్త ఎక్కువ వచ్చినా చాలని నానా చెత్తా డబ్బింగ్ చేసి వదిలేస్తున్నారు. మనవాళ్ళకు సినిమాల విషయంలో భాషా భేధాల్లేవని వాళ్ళకి తెలుసు. వాటినే తెలుగులో రీమేక్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా చూసేస్తారు. ఒకే సినిమాని ఇన్ని భాషల్లో చూడగల సత్తా మనకే వుంది. అందుకే హైదరాబాద్ ఆర్.టీ.సి క్రాస్ రోడ్స్ ఎప్పుడూ పుణ్యక్షేత్రాల రద్ధీతో వుంటుంది. బాంబులు పేలినా సెకండ్ షోకి వచ్చే జనాలు తగ్గరు. షో క్యాన్సిల్ చేస్తే తప్ప. కొత్త సినిమాలు ఏమొచ్చాయిరా అనే మాట కుర్రాళ్ళ మధ్య మామూలుగా వినిపిస్తుంటుంది. ఏమొచ్చినా చూసేద్దామని. ఎలా వున్నా చూసేస్తారనే ధైర్యంతోనే మనవాళ్ళు అద్భుత చిత్రరాజాలు తీసి, మన మీదకు మొహమాటం లేకుండా వదిలేస్తుంటారు. మనమూ వాళ్ళ నమ్మకం వమ్ము చేయకుండా కనీసపు వసూళ్ళు ఇప్పించేస్తాం.

ఇక పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులకు పిచ్చ టైమ్‍పాస్ అవుతుంది. సినిమా కాస్త బాగుంటే(అభిమానులకి బాగుంటే) చాలు, మళ్ళీ మళ్ళీ చూస్తూనే వుంటారు. ఇంక వీరాభిమానులు అందుకోసమే ఆడియో విడుదల నుంచే డబ్బులు ఆదా చేస్తుంటారు. ప్రతి రోజు వెళ్ళి థియేటర్ దగ్గర కలక్షన్లు లెక్క చూసుకు వస్తుంటారు. మా వూరులాంటి చిన్న టౌన్లలో పెద్ద సినిమాలు విడుదలైన మొదటి వారంలో, వూర్లోని సగం థియేటర్లలో ఆడించేస్తారు. ఆ వారంలో మొత్తం జనం చూసేసాక, ఇంక దాన్ని వంద రోజులకి ఆడించే బాధ్యత ఫాన్స్ తలకెత్తుకుంటారు. చేసిన వాళ్ళ కంటే, తీసిన వాళ్ళ కంటే, వీళ్ళు ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతారు. ఇక ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఇంక ఆ సందడి చెప్పనక్కర్లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బ్యానర్లు, ఒకరికొకరు పోటిగా కటౌట్లు పెట్టటాలు, పగలగొట్టటాలు, తగలబెట్టటాలు, లాఠీచార్జులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు. రెండు పక్కల వాళ్ళకీ టైమ్‍పాస్. తమ హీరో సినిమా అద్భుతంగా వుందని, అవతలి సినిమా తేలిపోయిందని జనాల్ని నమ్మించటానికి అభిమానులు గట్టిగా ప్రయత్నిస్తుంటారు. తమ హీరో సినిమా గురించి కంటే, అవతలి వాళ్ళ సినిమా ఎక్కడ బావుంటుందో అని ఎక్కువ కంగారు పడిపోతుంటారు. వీళ్ళ ఫాన్స్ షోల్లోకి వాళ్ళు, వాళ్ళ ఫాన్స్ షోల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి, బయటకి వచ్చి అబ్బే అంత సీన్ లేదు అని పెదవి విరుస్తుంటారు. డబ్బులు పెట్టి వచ్చిన సినిమా బాలేదని సంతోషించే సందర్భం అదేనేమో. సినిమాలో వినోదం కంటే బయట ఇలాంటి వినోదాలు ఎక్కువుంటాయి పెద్ద హీరోల సినిమాలకు. అవి ఆడుతున్నన్ని రోజులూ అభిమానులకు బోర్ అనేది వుండదు.

ఇంక నాలాగా పరిక్షల ముందు రోజు తప్ప మిగతా అప్పుడు పుస్తకం పట్టుకునే అలవాటు లేని వాళ్ళకు, సినిమా చూడటమనేది రోజూ భోజనం చేసినట్టు. కాలేజీలో వున్నప్పుడైతే ఎవడో ఒకడు ఉబుసుపోక థియేటర్ వైపుకు వెళ్ళి టికెట్లు కొనేసి తర్వాత అందరిని పిలిచేవాడు. మేము, ఏం సినిమా అని కూడ అడగకుండా పోలోమని వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళాక థియేటర్ ముందు నుంచుని ఆ సినిమాకు వచ్చినందుకు సాకులు వెతుక్కునే వాళ్ళం. మంచి డైరెక్టర్ అనో, హిట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అనో, హీరోయిన్ బావుందనో, ఏదో చచ్చు సాకు వెతుక్కుని, మాకు మేమే సమాధానపరచుకునే వాళ్ళం. సినిమాలో చిరంజీవి కటౌట్ చూపించాడనో, పోస్టర్ చూపించాడనో వెళ్ళి చూసిన రోజులు కూడా వున్నాయి. నేను మొదట్లో, మా బ్యాచ్ మాత్రమే ఇలా వుందనుకున్నా, మెల్లగా తెలిసొచ్చింది, మన రాష్ట్రంలో చాలా మంది ఇంతేనని, సినిమాలు మన జాతీయ టైమ్‍పాస్ అని. ఆ మధ్య ఐఐటీలో చదివే మిత్రుడొకడ్ని క్లాస్‍మేట్స్ ఫుట్‍బాల్ ఆడటానికి పిలిస్తే, ఆటెందుకు టైమ్ వేస్ట్, ఆ టైమ్‍లో ఒక సినిమా చూడచ్చు అని చెప్పి, మిగతా రాష్ట్రాల వాళ్ళను కంగు తినిపించాడు. మన వాళ్ళ సినిమా పిచ్చి లోకవిదితం. కన్నడ, తమిళ దేశాల్లో, తెలుగు వారంటే కారం ఎక్కువ తింటారు, సినిమాలు ఎక్కువ చూస్తారు అనే అభిప్రాయం స్థిరపడిపోయింది.

మనవాళ్ళకు సినిమా చూసాక దాని మీద తమ అభిప్రాయం ఎవరికో ఒకరికి చెప్పకపోతే నిద్ర పట్టదు. అది ఇంకో రకం టైమ్‍పాసు. ఆంధ్రాలో ప్రతి రెండో వాడూ కవేనని ముళ్ళపూడి వెంకటరమణగారి వెక్కిరింత. కవి మాటేమోగాని ఆంధ్రాలో ప్రతివాడూ సినీ విమర్శకుడే. అభిమానులు సినిమా ప్రమోషన్లో బిజిగా వుంటే, మిగతా వాళ్ళు తమ సినీ సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శించటంలో బిజీగా వుంటారు. సినిమా బాలేకపోతే ఎందుకు బాలేదో, బావుంటే ఎందుకు బావుందో, ఎక్కడ లోపముందో, ఎక్కడ ఇంకా బాగా తీయచ్చో, తమ సుదీర్గ సినీ వీక్షణానుభవం ఉపయోగించి ఎవరూ అడగకపోయినా అమూల్యమైన అభిప్రాయాలు సెలవిస్తుంటారు. స్క్రీన్‍ప్లే అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా ఆ పదాన్ని విరివిగా వాడేస్తుంటారు. స్క్రీన్‍ప్లే వీక్‍గా వుందని, ఫస్ట్ హఫ్‍లో టెంపో సెకండ్ హఫ్‍లో లేదని, ఇంటర్వెల్ బ్యాంగ్ సరిగ్గా కుదర్లేదని, పిక్చరైజేషన్ సరిగ్గా రాలేదని, ఇలా తమకే అర్ధం తెలియని పదాలు వాడేసి, అవతలి వాళ్ళకి విజ్ఞాన ప్రదర్శన ఇస్తుంటారు. 'ఎ' క్లాస్ సెంటర్లో ఎలా ఆడుతుందో, 'బి','సి' సెంటర్లలో ఏమాత్రం కల్లెక్షన్స్ వస్తాయో జోస్యం చెప్పేసి, సినిమా మార్కెట్ పై తమకుగల అవగాహన తెలియపరుస్తుంటారు.

మనవాళ్ళని ఎవరైనా అజ్ఞానం కొద్దీ, మీ హాబీస్ ఏమిటని అడిగితే రీడింగ్ బుక్స్, చాటింగ్ విత్ ఫ్రెండ్స్ అని ఆంగ్లంలో అనేస్తారు గాని, ఎక్కువమంది తినటం, ఇంజనీరింగ్ చదివెయ్యటం, సినిమాలు చూడటం ఇంతే. మన రాష్ట్రంలో ఇవి తప్ప వేరే పనులు చేసేవాళ్ళు వింతజీవుల కింద లెక్క. వాళ్ళని అర్జంటుగా తెలుగేతరులుగా గుర్తించి, వేరే రాష్ట్రాలకు పంపించేసేలా జీవో 610 లాంటిదేదైనా పాస్ చెయ్యాలి.


12 అభిప్రాయాలు:

Anonymous said...

హలో బాసూ,

సరిగ్గా చెప్పావు. "చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ మంచి పుస్తకం కొనుక్కో" అన్నాడో మహానుభావుడు. ఇప్పుడు చిరిగిన చొక్కాలే ఫాషన్ అవుతాయనీ, షకీలా కుక్క బొచ్చు ఊడిందని చెప్పే పత్రికలే మంచి పుస్తకాలవుతాయని ఊహించలేదేమో ఆ మహానుభావుడనిపిస్తోంది.

రాధిక said...

నిజాలు చెప్పేస్తారేమిటి మాష్టారూ? నాలాంటి సినిమా పిచ్చోళ్ళు బాధపడతారు.

Anonymous said...

సరిగ్గా చెప్పారు. ఇప్పటికీ నాకు టైం పాస్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది సినిమానే.

ravi said...

correct ga chepparu ,andhra lo koddiga vayasu perigee sariki engineering tappa vere chaduvu kosam chudaru ,oka veela chusina dabbulu vacheevi chustaaru

చదువరి said...

బావుంది! ఆవకాయ, గోగూర, పెరుగన్నం.. వీటిపక్కన ఇంజనీరింగు, సినిమాను చేర్చేసారన్న మాట!

Rajendra Devarapalli said...

అయ్యా చదువరి గారూ గోంగూరలో సున్నా ఎగరకొట్టేశారు కదండీ సున్నా లేకపోయినా,పులుపు లేకపోయినా గోంగూర ఇంకెందుకు పనికొస్తుందండీ?
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
http://visakhateeraana.blogspot.com/

చదువరి said...

:).. అవున్నిజం, రాజేంద్ర గారూ!
భరించొచ్చు సున్నా లేకున్నా,
పనికిరాదు పులుపు లేకున్న!
తప్పు నెత్తిపట్టినందుకు నెనరులు!

crystal said...

Good one baasu.

Sasank said...

article baagundhi...kaani emi cheddam manaki idhi tara tarala nunchi...vasthunna oka sampradayam leka varasathvam la ayipoyindhi ee cinemalu ante......evarini aina adugu ....weekend emi chesavu ra ante......lechanu, tinnanu,cinemaki vellanu....cinema valla headache vacchindhi...daani valla padukunna.......idhe ippati janalllo weekend trend.............

cinema ....janala jeevithallo oka antharbhaagam ayipoyindhi anataaniki idhi oka nidharsana.........

rākeśvara said...

నేను నివ్వెఱ పోయిందెప్పుడంటే,
నేను కేరళంలో చదువుతూ ఇంటికి ఒక సారి వెళ్ళినప్పుడు, ఎవరిదో తద్దినానికి వెళ్ళా.
అక్కడ అందరూ సినిమాల గుఱించి మాట్లాడుకుంటున్నారు. నేను చూస్తేనేమో, నాలుగేళ్ళలోఁ నాలుగు తెలుగు సినిమాలు కూడా చూడలేదాయే...
హథవిధీ అనుకున్నా!

శ్రీ said...

బాగా చెప్పారు.

Telugunetflix said...

https://www.telugunetflix.com
https://www.telugunetflix.com
https://www.telugunetflix.com