Monday, October 15, 2007

బెంగుళూరు పుస్తకోత్సవంలో నేను కొన్న పుస్తకాలు

బెంగుళూరులో ప్రతి ఏడాది జరిగే పుస్తకోత్సవం ఈ నెల 12వ తారీకున మొదలయ్యింది. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సుమారు 200 స్టాల్స్ పైగా ఏర్పాటు చేసారు. ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, ఇంకా మన తెలుగు పుస్తకాల స్టాల్స్ వున్నాయి. అన్నిటి కన్నా ఎక్కువ భాగం ఇంగ్లీష్ పుస్తకాలు వుంటే, దాని తర్వాత స్థానం కన్నడ పుస్తకాలు ఆక్రమించాయి. కన్నడ సాహిత్య ప్రముఖుల చిత్రపటాలు, వారి వారి స్వదస్తురితో వ్రాసిన వ్రాత ప్రతులను ప్రదర్సించటానికి ఒక స్టాల్ ని కేటాయించారు. దాని తర్వాత స్థానంలో తమిళ పుస్తకాలు వున్నాయి. అన్నిటి కన్న తక్కువ వున్నవి మన తెలుగు పుస్తకాలే. కేవలం రెండు స్టాల్స్ కి పరిమితం అయ్యాయి. విశాలాంధ్ర పబ్లిషర్స్ వారిది ఒకటి, టాగూర్ పబ్లిషర్స్, హైదరాబాద్ వారిది మరోటి.

నేను, ఇంకా ఇద్దరు మిత్రులు కలిసి వెళ్ళాం అక్కడికి. తెలుగు స్టాల్స్‌ని వెతుక్కుంటూ వెళ్ళి ఆఖరికి విశాలాంధ్ర స్టాల్లో దూరిపోయాను. లోపలికి వెళ్ళగానే విశ్వనాధ సత్యనారాయణ వారి పుస్తకాలు అన్నీ కలిపి ఒక పెద్ద ప్యాక్ చూపించారు నిర్వాహకులు. నాకు కావలసినవి రెండు వున్నాయి దానిలో. రెండు పుస్తకాల కోసం మొత్తం ప్యాక్ కొని బాదించుకోటం ఎందుకనిపించింది. జేబులో చిల్లర సరిపోదని, ఈసారి వచ్చేటప్పుడు ఇలాంటి తలకు మించిన పధకాలకు ఫండ్స్ ఎలా సమకూర్చాలో రోశయ్యని కనుక్కుని వస్తానని చెప్పి లోపలికెళ్ళాను. స్టాల్ చిన్నదైనా మంచి పుస్తకాలు చాలానే కనిపించాయి.

మొదటగా గురజాడ రచనలు దొరికాయి. వారి కథానికలు, గిడుగు రామ్మూర్తి లాంటి సమకాలీనులతో జరిపిన ఉత్తర-ప్రత్యుత్తరాలు వున్నాయి వాటిలో. తర్వాత కొడవగంటి కుటుంబరావు గారి పుస్తకాలు కనిపించాయి. వారు రాసిన వ్యాసాలన్ని వర్గీకరించి మొత్తం ఎనిమిది సంపుటాలుగా చేసారు. సైన్స్ వ్యాసాలు, చరిత్ర వ్యాసాలు, రాజకీయ వ్యాసాలు మొదలైనవి. వాటిల్లో చరిత్ర వ్యాసాలు కొన్నాను. ప్రాచీన భారతం నుంచి నేటి కుల వ్యవస్థ దాకా అన్ని దశల గురించిన వ్యాసాలున్నాయి. ఈ దశలలో స్త్రీల స్థితిగతుల గురించి స్త్రీ పర్వం అని ప్రత్యేకంగా వున్నాయి. రామాయణ కథలో ఫాసిజంని చూసే కమ్యూనిస్ట్ రచయితల్లో ఈయన ఒకడని, పుస్తకం వెనక వైపు అట్ట మీద చదివితే తెలిసింది. సరే, రంగనాయకమ్మ గారు చెప్పంది, ఈయనేమి చెబుతాడో చూద్దామని కొన్నాను.

కాసేపు వెతికాక నామిని సుబ్రమణ్యం నాయుడు వ్రాసిన మిట్టూరోడి పుస్తకం దొరికింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఏదో ఒక పత్రికలో మిట్టూరోడి కథలు చదివినట్టు గుర్తు. మళ్ళీ ఇన్ని రోజులకి దొరికింది. ఆ కథలతో పాటు, అదే రచయత రాసిన సినబ్బ కథలు, మునికన్నడి సేద్యం లాంటివి అన్నీ కలిపిన సంపుటమే ఈ మిట్టూరోడి పుస్తకం. ఇంకాసేపటికి చలం పుస్తకాలు కనపడ్డాయి. చాలా కలక్షన్ వుంది. నా దగ్గర లేనివి చాలా కనిపించాయి. మ్యూజింగ్స్, స్త్రీ, సాహిత్య సుమాలు, ఇంకా ఇతర వ్యాసాలు, నవలలు అన్నీ కలిపి జాబితా తీస్తే మొత్తం పద్నాలుగు పుస్తకాలు తేలాయి. వీటికయ్యే ఖర్చు, వాటిని చదవటానికి వెచ్చించాల్సిన సమయం లాంటివి గుర్తొచ్చినా, మనసు మాత్రం చలం నాయిక లాగా ఎదురు తిరిగింది. కొనాల్సిందేనంది. ఆఖరికి దాని కోరిక ముందు తలవొగ్గాల్సి వచ్చింది. త్రిపురనేని వారి సూతపురాణం కోసం వెతికాను. దొరకలేదు.

అక్కడితో బరువైన విషయాలున్న పుస్తకాలు కొనటం ఆపేసి హస్యం మీద పడ్డాను. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతి వారం వచ్చిన మృణాలిని గారి శీర్షికల సంపుటి 'తాంబూలం', తెలుగు ప్రముఖుల చతురోక్తులకి, బాపు గారి చిత్రోక్తులు జోడించిన శ్రీరమణ గారి హస్యజ్యోతి, ఇంకా కొన్ని హస్య కథల పుస్తకాలు కొన్నాను. ముళ్ళపూడి వారి బుడుగు కనిపించింది. అది నా దగ్గర వుంది. కాని అదేంటో దాన్ని షాప్ లో ఎప్పుడు చూసినా మళ్ళీ కొనాలని మనసు టెంప్ట్ అవుతుంది. ఆ పుస్తకాన్ని అక్కడ వుంచి కొనకుండా దాని చుట్టు పక్కల తిరిగే జనాన్ని చూస్తే, ఎంత మిస్ అవుతున్నారో అనిపిస్తుంది. నా మిత్రుడొకడ్ని కొనమని ప్రోత్సహించాను. నా ప్రోత్సాహమే గాని వాడిలో ఉత్సాహం కలగలేదు. మంచి పుస్తకం చదవటానికి కూడా జాతకంలో రాసుండాలి కాబోలు. పాపం, ఇలాంటి దురదృష్ట జాతకులందరు ఆంధ్రాలోనే పుడుతున్నారని జాలి వేసింది.

వచ్చే ముందు పానుగంటి వారి సాక్షి వ్యాసాల సంపుటి కనిపించింది. మనసు దాని వైపు గట్టిగా లాగింది గానీ, అప్పటికే పెట్టిన ఖర్చు సహస్రం దాటటంతో మనోనిగ్రహం సాధించవలసి వచ్చింది. నాకు మామూలు సమయాల్లో, నేను మంచి ఉద్యోగం చేస్తున్నట్టు, బాగా సంపాదిస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, పుస్తకాల షాపు‌లోకో, సీడీ షాపు‌లోకో వచ్చినప్పుడు మాత్రం, నేను కటిక పేదరికం అనుభవిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. షాప్‌లోకి దూరి, జేబు తడుముకోకుండా, సంకోచించకుండా నచ్చిన పుస్తకాలు ఎప్పుడు కొంటానో ఏమిటో.

బయటకి వచ్చేసరికి ఫలహరశాల కనిపించింది. అప్పటి వరకు, ఏంటి వీడి పుస్తకాల గోల అని చిరాగ్గా వున్న నా మిత్రులు కాస్త సంతోషించారు దాన్ని చూసి. దాంట్లోకి దూరి కాస్త కతికాము. ఐటమ్స్ ఛండాలంగా వున్నాయి. లోపల షాపులో పెట్టిన ఖర్చు కంటే, ఫలహరాలకు పెట్టిన ఖర్చు దుబారాలా అనిపించింది. మొత్తానికి బోల్డన్ని పుస్తకాలతో ఇల్లు చేరాను. ఇంకొన్ని నెలల వరకు పుస్తకాల షాప్ వంక చూసే పని లేదు.


18 అభిప్రాయాలు:

Aruna said...

Wav...
intaki bangalore lo ekkaDa ee book exhibition jarugutondi. Naku koncham cheppanDi.

చైతన్య కృష్ణ పాటూరు said...

బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో జరుగుతోందండి. పూర్తి వివరాలు క్రింది లంకెలో తెలుసుకోవచ్చు.

http://www.bbf-2007.com/Index1.html

RG said...

నాకు మామూలు సమయాల్లో, నేను మంచి ఉద్యోగం చేస్తున్నట్టు, బాగా సంపాదిస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, పుస్తకాల షాపు‌లోకో, సీడీ షాపు‌లోకో వచ్చినప్పుడు మాత్రం, నేను కటిక పేదరికం అనుభవిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. షాప్‌లోకి దూరి, జేబు తడుముకోకుండా, సంకోచించకుండా నచ్చిన పుస్తకాలు ఎప్పుడు కొంటానో ఏమిటో.


Baasu... Ikkadaa same to same... :(

cbrao said...

ఒక పూట అన్నం మానెయ్ కాని మనసుకు నచ్చిన పుస్తకం కొనుక్కో.

చైతన్య కృష్ణ పాటూరు said...

రావు గారు,

బాగా చెప్పారు. ఇంకా అంత పరిస్థితి రాలేదు లెండి. వచ్చినప్పుడు, అదే చేస్తాను.

Unknown said...

బెంగళూరు పుస్తకోత్సవం గురించి తెలియజెప్పినందుకు నెనర్లు.

వచ్చే శనివారం నేను తప్పక అక్కడికి వెళ్తాను. ప్రస్తుతానికైతే నా దగ్గర చాలా చదవవలసిన పుస్తకాలున్నాయి. కాని ఒకసారి చూసి ఏమైనా కొత్త పుస్తకాలు దొరుకుతాయేమో చూసొస్తా.

మీకు పుస్తక ప్రదర్శనల గురించి గానీ, ఫుస్తకోత్సవాల గురించి గానీ తెలిస్తే తప్పక బ్లాగ్ముఖంగా(ఎలా అయినా పరవాలేదండి) తెలియజేయమని మనవి చేస్తున్నా.

మెహెర్ said...

'బుడుగు' విషయంలో నాదీ సేమ్ ఫీలింగ్. ముళ్ళపూడి తర్వాత ఆ స్థాయి హాస్యరచయిత మరలా రాలేదు. (పూర్తిగా హాస్యరచయిత అని టాగ్ వేసేయడమూ అన్యాయమే.) బాపు & రమణ: ఇంత ప్రతిభావంతులు ఇద్దరూ చిన్నప్పుడే స్నేహితులవడం నిజంగా గొప్ప యాదృచ్ఛికం, మన అదృష్టం.

మేధ said...

నేను కూడా వెళ్ళానండీ పోయిన శనివారం….

అవును నాకూ అదే అనిపించింది…ఇంగ్లీష్ వి అన్ని ఉన్నాయి, తెలుగువి మరీ రెండే ఉన్నాయి అని…

నేనూ కొన్నాను కొన్ని పుస్తకాలు, వాటిల్లో కొన్ని,

కొమ్మకొమ్మకో సన్నాయి - వేటూరి
పండితపరమేశ్వరశాస్త్రి వీలునామా - గోపీచండ్
చివరకు మిగిలేది – బుచ్చిబాబు
అంపశయ్య – నవీన్

ఇంకా కొన్ని నవలలు, మా బామ్మగారికి కొన్ని పురాణాలు…

Gems Of Hindupur said...

modati bloge adara goottaru... all the best

Unknown said...

chala baga rasaru modati tapane adhirincharu ponuponu angla padalu takkuvaga telugu padalu ekkuvaga ragalavani aashisthunnanu

Unknown said...

ఓ చిరిగిన చోక్కా తొడుక్కున్నా పర్వాలేదు, ఓ మంచి పుస్తకం కోనుక్కో అన్నారు...

rākeśvara said...

అఱె నేను కూడా వెళ్లానే ఆ పుస్తక ప్రదర్శనకి,
నేను అత్తగారి కథలు, ఇంకా వేరే ఏవో కొన్నాను.
అప్పుడే నెల రోజుల క్రితం భాగ్యనగరంలోఁ విశాలాంధ్రకి వెళ్లడంతో పెద్దగా కొనడానికి ఏం మిగలలేదు.

అక్కడ సాహిత్య అకాదమీ వారి స్టాలులో నేను
శ్రీశ్రీ, అన్నమాచార్యులు మఱియు కృష్ణశాస్త్రి జీవిత కథలు కొన్నాను.
వారు తెలుగు కన్నడ నిఘంటువు కూడా అమ్ముతున్నారు, కానీ నాకు కన్నడ తెలుగు నిఘంటువు కావలసివచ్చి దానిని కొనలేదు. తప్పుపని చేసాను. ఇప్పుడు అది దొరకడం తుంబ కష్టా అయితు.
ఈ మధ్య కన్నడ పుస్తాకలు కొంటున్నాను లెండి :)

Purnima said...

meeru raase teeru bhale undi.. keep posting!! avunoo komma komma koo sannayi pustakam mee daggara undaa?? .. daani publishers evaro cheppagalaraa??

చైతన్య కృష్ణ పాటూరు said...

పూర్ణిమ గారు,

మీ కామెంటుకు నెనెర్లు. ’కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకాన్ని ప్రచురించింది వేటూరి సాహితీ సమితి. నేను దీన్ని కొన్నది తిరుపతి విశాలాంధ్రలో అనుకుంట (సరిగ్గా గుర్తులేదు)

Chinni said...

annayya (Naa kanna peddavaadivenani anukuntunnnau) nuvvu chinnapudu nunchi chadivina pustakklu blog chadivaanu anta same to same (okka philosophy period takka, but i read "oka yogi aatma katha"). Next this blog nenu exact gaa ee pustakkalu ayite monna monna teesukochi chadivaano ave pustakkalu ee pustakaalu ayite miss ayyano ave nuvvu select cheyaledu. Demudi dayavalla naaku dabbulu takkuva levu gaani arabbodi dayavalla petrol retlu perigi vimaanam lo mosukupoye total weight taggginchasarani vadileyavalasi vacchindhi.

sahasra said...

telugu blog chala bagunnayi mee abipraayaalu

Prasad said...

good

Telugunetflix said...

Nice
https://www.telugunetflix.com
https://www.telugunetflix.com
https://www.telugunetflix.com