నమస్కారం. చైతన్యం అన్న బ్లాగు పేరు చూసి అది ఈ బ్లాగులో వుంటుందనో, లేక నాకు తెగ వుందనో అనుకునేరు. నా పేరులోని చైతన్యం నాలోకి, నా బ్లాగ్ లోకి రావాలని ఆశిస్తూ ఆ పేరు పెట్టానంతే. తెలుగు బ్లాగుల గురించిన చైతన్యం నాకు చాలా మంది కన్నా ఆలస్యంగా కలిగింది. అది నా తల్లోంచి చేతుల్లోకి, దాంట్లోంచి నా మూషికంలోకి రావటానికి ఆరు నెలలు పట్టింది. ఆంధ్రులు ఆరంభ శూరులన్న నానుడికి బలం చేకూర్చటం ఎందుకని, ఖాళీ దొరికినప్పుడు మొదలెడదామని వాయిదా వేస్తూ వచ్చాను. కానీ ఖాళీ అనేది బ్రహ్మ పదార్ధమని, అది ఎప్పటికీ దొరకదని ఈమధ్యే జ్ఞానోదయమయ్యింది. అందుకే మొదలెడుతున్నా. చాలా బ్లాగుల్లా ఇది కూడా నాకు నచ్చినవి, నచ్చనివి, చదివినవి, తెలుసుకున్నవి అందరితో పంచుకోవటానికే.
ఇక నా గురించి చెప్పుకుంటే పెద్దగా ఏమి లేదు. తినటం, తొంగోవటం, దొరికిన పుస్తకాలన్ని చదవటం, కనపడ్డ సినిమాలన్ని చూడటం. ఇవి తప్ప, రావుగోపాల్ రావు చెప్పిన కళాపోషణ లాంటివేమి లేవు. తెలుగు భాష మీద అభిమానం కొంచం ఎక్కువ, తెలుగు సాహిత్యం మీద చాలా మక్కువ. అంటే సాహిత్యం గురించి తెగ తెలుసని కాదు, చదవటానికి ఇష్టపడతానని. పుట్టింది కోస్తాలో, పెరిగింది రాయలసీమలో, ప్రస్తుతం సేదతీరుతున్నది బెంగుళూరులో. ఇక మీదట నుంచి క్రమం తప్పకుండా నా ఆలోచనలు, అనుభవాలు అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నాను.
7 అభిప్రాయాలు:
స్వాగతం! మంచి మూసను ఎంచుకున్నారు.
తథాస్తు! మంచి మంచి టపాలతో మీ బ్లాగు కళకళలాడాలని ఆశిస్తున్నాను.
నాయనా చైతన్యం మంచిది. మీకు శుభం కలుగుగాక. కానీ, మీరు మూషికం అనే పదం వాడారు. మూషికం అంటే ఎలుక. కొంపదీసి మస్తిష్కం అనబోయి మూషికం అన్నారా ఏంటి?
చదువరి గారికి, ప్రవీణ్ గారికి నెనెర్లు.
విజయకుమార్ గారికి,
నేను మూషికం అంటే కంప్యూటర్ మౌస్ అనే వుద్దేశంలో వాడానండి. చాలా రోజులుగా బ్లాగర్ వెబ్ సైట్ లో create your blog now అనే బటన్ మీద నొక్కటానికి సందేహిస్తూ ఆగిపోయాను. ఇన్నాళ్ళ్టికి నా మౌస్ లోకి చైతన్యం వచ్చిందని నా వుద్దేశం.
ఇక ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిన సినిమానో, పాటో లేక పుస్తకమో ఆఖరికి బెంగళూరు ఆటో గురించొ రాసేయండి మరి.కాదేది బ్లాగుకనర్హం అని ఒక బ్లాగరి ఉవాచ. గుర్తుంచుకోండి -ఆటో వాడు మీటర్ మీద ఎక్స్‌ట్రా అడిగితే అది బ్లాగువార్త కాదు. మీటర్ మీద వస్తానంటే అది బ్లాగులో రాయవలసిన వార్తే.
cbrao
http://deeptidhaara.blogspot.com/
బ్లాగ్లోకానికి సుస్వాగతం.మీ రచనా శైలి చూస్తుంటే ముందు ముందు మంచి టపాలు కోసం వేచి చుడొచ్చని అనిపిస్తుంది.
All the best.
నా అభిప్రాయమూ డిటో విహారి గారిదే. ఆక్రమణ్‌ణ్‌ణ్....!
మీ అభిప్రాయం తెలపండి