Sunday, October 5, 2008

హిందూ తీవ్రవాదం

ఇన్నాళ్ళూ మనకు తీవ్రవాదం అంటే ఇస్లామిక్ తీవ్రవాదమే గుర్తొచ్చేది. ఇప్పుడు కొత్తగా హిందూ తీవ్రవాదం మొదలయ్యింది. గుజరాత్ మారణకాండలోను, ఒరిస్సా మతఘర్షనల్లోను వీరు తమ ఉనికిని బలంగా చాటుకున్నారు. ఇవి చెదురుమదురు సంఘటనలే అనుకోటానికి లేదు. ఈ దాడులు గమనిస్తే ఇవి పక్కా ప్రణాళిక ప్రకారం చేసినవని తెలుస్తుంది. ఇంత ప్రణాళికాబద్దంగా జరిగే హింసని తీవ్రవాదమనే అనాలి. దీన్నీ మిగతా మత తీవ్రవాదాలతో సమానంగా పరిగణించి ఖండించాలి అనటంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు. కానీ అసలు గొడవ ఎక్కడ మొదలౌతుందంటే, ఈ దాడుల్ని తీవ్రవాదంగా భావించి ఖండించే మేధావులు, మిగతా మతాలు చేస్తున్న హింసకి మాత్రం కారణాలు వెతుక్కుని, వారి ఆవేశాన్ని సానుభూతితో పరిశీలించాలని చెప్పటం దగ్గర. మాటకు పదిసార్లు లౌకికత్వం గురించి మాట్లాడే మన ప్రభుత్వము, మన మేధావి వర్గము, నిజంగా అలాగే ప్రవర్తించుంటే ఈ కొత్త తీవ్రవాదం పుట్టక పోయుండేదని నా నమ్మకం.

ఎలాంటి తీవ్రవాదులకైనా జనాల సహకారం ఎంతో కొంత లేకుండా కార్యకలాపాలు చెయ్యటం కష్టం. నేను, ఈమధ్య వరకు కూడా హిందూ ఓటు బ్యాంకు, హిందూ తీవ్రవాదం అనేవి సాధ్యం కావని అనుకునేవాడిని. ఎందుకంటే ఇవి రెండూ కుదరాలంటే ఆ మతం చాలా వ్యవస్థీకృతమైనదిగా వుండాలి. హిందూ మతం శతాబ్దాలుగా ఎన్నో విభిన్న శాఖలుగా చీలి, ఎన్నో కొత్త భావాల్ని కలుపుకుని, ఎన్నో పరస్పర విరుద్దమైన విషయాలను తనలోకి ఇముడ్చుకుని, ఒక జీవన విధానంగా అవతరించింది. అది ఒక మతానికుండే నిర్మాణాన్ని(structure) ఎప్పుడో పోగొట్టుకుంది. నిజానికి దాన్ని ఒక మతమనటమే తప్పు. మతం ఇంత వైవిధ్యాన్ని ప్రదర్శించలేదు. ఇంత చిందరవందరగా ఎవరికి వారుగా బ్రతికే గుంపులోంచి చాలా ఆర్గనైజ్డ్‍గా, నిర్ధిష్టమైన లక్ష్యం కోసం పని చేసే తీవ్రవాదం పుట్టడము, నిలదొక్కుకోవటమూ కష్టం. కానీ ఇప్పుడు మొదలయ్యింది. అందుకు నాకు తోచిన కారణాలు ఇవి.

ఈ దేశంలో మిగతా మతాలతో పోలిస్తే హిందువుల్లో తమ మతం గురించిన పట్టింపులు మొదట్నుంచి తక్కువ, పరమత సహనం ఎక్కువ. కానీ ఈ మధ్య కాలంలో సామాన్య హిందువుల్లో కూడా మతాభిమానము, మనమంతా హిందువులం అనే భావనా పెరిగింది. విభిన్న కులాలుగా, విభిన్న ఆచారాలతో బ్రతుకుతున్న వీరిని గుంపుగా చేరుస్తున్నదేమిటో గమనిస్తే అది వారి మతమూ, ఫిలాసఫీ కంటే, పక్క మతాల పై పెరుగుతున్న నిరసన, కోపం ఎక్కువగా కనిపిస్తుంది. హిందువులుగా చెప్పబడుతున్న ఈ వైవిధ్యమైన గుంపు ఎప్పుడూ proactiveగా ఒక్కటవ్వలేరు, కేవలం reactiveగానే ఒక్కటిగా కలవగలరు. మిగతా మతాల వారిలా proactiveగా కలిసుండటానికి వీరికి కారణాలు బహుతక్కువ. ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న ఐకమత్యం కూడా అలా ప్రతిక్రియ(reactive)‍గా వచ్చిందే. అందుకు కారణం, తమ దేశంలోనే తమ మత విశ్వాసాలకి అడుగడుగునా సంజాయిషీ చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వారు భావించటం. అది నిజమేనని నిరూపించి, వారిలో మరింత అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్న బాంబు దాడులు, క్రైస్తవ మిషనరీలు చేస్తున్న సాంస్కృతిక దాడులు, వారిని వెనకేసుకొస్తున్న ప్రభుత్వము, మరియు మేధావి వర్గము.

ఒక పక్క వారంవారం ఠంచనుగా బాంబులు పేలి జనం చస్తుంటే, వాళ్ళవాళ్ళని మన పోలీసులు వేధిస్తున్నారంట, అందుకే కడుపు మండి పేలుస్తున్నారు పాపం, అని సమర్ధించేవారు కొందరు. మన మతాన్ని, విశ్వాసాల్ని కించపరుస్తున్నారు అంటే, మతప్రచారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, పక్క మతాల్ని తప్పుపట్టకుండా మతప్రచారం ఎలా చేసుకుంటారు పాపం,  మనమే సర్దుకోవాలి అని వెనకేసుకొచ్చేవారు ఇంకొందరు. తప్పు ఎవరు చెసినా ఒకటే, అని ఖండిస్తే చల్లారిపోయే దానికి, మనం చెయ్యలేదా, మనలో లేదా అని ఎదురుదాడికి దిగి మరింత నిప్పు రాజేస్తారే కానీ, వారికి అవి తప్పుగా కనిపించవు. ఈ మేధావి వర్గం రెండు వైపులా ఖండించటం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఏకపక్ష ఖండనే. హైందవేతరుల తప్పుల్ని ఖండించాల్సొచ్చినప్పుడు కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడరు. ఈ రకంగా మైనారటీలను చంకనేసుకుని గారాభం చేసే వాళ్ళున్నంత కాలం ఈ సమస్య పరిష్కారం అవ్వదు.

హిందువుల్లో ఈ అతివాద గ్రూపులు ఎప్పట్నుంచో వున్నాయి కానీ ఇన్ని రోజులు వాటికి సామాన్య జనాల సపోర్టు, సానుభూతి లేదు. పైగా వ్యతిరేకత వుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. అసలు బీజేపీకి దక్షిణ భారతదేశంలో అడుగు పెట్టటం సాధ్యమవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ జరిగింది. ఈ అతివాద గుంపులను ఇన్ని రోజులు అడ్డుకున్నది, వ్యతిరేకించినది కూడా మితవాద హిందువులే. ఇప్పుడు వారే పక్కకి తప్పుకుని అతివాదులకు దారి వదిలేస్తున్నారు. తమ మతం పై జరుగుతున్న సాంస్కృతిక, భౌతిక దాడుల పట్ల వారి అసంతృప్తి, అతివాదులకు ఇంధనంగా మారుతోంది. ఏ మతంలో ఐనా తీవ్రవాదులు తమ చర్యలకు ఏదో ఒక కారణాలు చూపిస్తూనే వుంటారు. వీరికి సామాన్యుల నుంచి సానుభూతి దొరకటం ప్రమాదకరమైన విషయం. నిన్న మొన్నటి వరకు హిందూ అతివాదుల చర్యలకు చిరాకుపడ్డ హిందువులు కూడా, ఇప్పుడు "అలాంటి అతిగాళ్ళకు పోటీగా, ఇలాంటి అతిగాళ్ళు వుండాల్లే, లేకపోతే ఇంకా రెచ్చిపోతారు" అనటమే, వారికి సానుభూతి పెరుగుతోందనటానికి సాక్ష్యం. తమకు పెరుగుతున్న సపోర్ట్ గమనించే, వారు కూడా ఇష్టానుసారం భారీ దాడులకు దిగుతున్నారు.

ఇన్ని రోజులు ఈ దేశం లౌకికదేశంగా వుందంటే, దానికి కారణం ఇక్కడి మెజారిటీ మతంలోనే లౌకికత్వం వుండటమేగాని, అదేదో రాజ్యాంగంలో ప్రకటించేస్తే వచ్చింది కాదు. అలాంటి హిందూ మతమే ఇవాళ తన విశాలత్వాన్నీ, విభిన్నత్వాన్నీ స్వచ్చందంగా వదులుకుని, బలం కోసం ఒక సంకుచిత మూసలోకి ఒదుగుతోంది. ఇన్నాళ్ళు హిందూ మతంగా భావిస్తున్నది నిజానికి మతం కాదు, కాని కొత్తగా ఇప్పుడు పుడుతోంది. తన విశాలత్వానికి మేధావుల దృష్టిలో విలువ లేకపోవటం గమనించి తను కూడా మిగతా మతాల్లాగా మారాలని ప్రయత్నిస్తోంది. భిన్నత్వాన్ని అంగీకరించగలగటమే హిందూమతం యొక్క బలం, అదే దాని బలహీనత కూడా. దాన్ని ఒదులుకుంటే అది తనలోని ఎన్నో బలహీనతలను అధిగమించగలదు. కానీ భిన్నత్వాన్ని అంగీకరించగల దాని స్వభావమే, ఈ దేశ లౌకికత్వనికి రక్ష. అది గమనించకుండా దాని బలహీనతల పైన దాడికి దిగటం ప్రమాదకరం. అటువంటి చేష్టల పర్యవసానమే, అతివాదులకు పెరుగుతున్న ఆదరణ. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమేనన్న మెసేజ్ జనాల్లోకి వెళ్ళనంత వరకు, వూరికే లౌకికత్వమని, ఇంకోటని గొంతు చించుకుని అరిచినా ఏమీ లాభం ఉండదు.


26 అభిప్రాయాలు:

Anonymous said...

నేనిక్కడో వ్యాఖ్య రాసి పంపిస్తే డూప్లికేట్ యాక్షన్ ఎర్రర్ అని వచ్చి రాసిందంతా పోయింది. మొత్తమ్మీద దాని సారాంశమిది:

ఇక్కడ మీరు రాసినది చాల వాస్తవం! నా పదహారేళ్ళ వయసు నుండి ఈ విషయంలో నా ఆలోచనల్లో వచ్చిన పరిణామానికి కారణాలు మీరిక్కడ రాసారు. మొత్తమ్మీద నా మనసును తడిమారు.

కామేశ్వరరావు said...

మీరు చెప్పినదాంతో నేను ఏకీభవిస్తునాను. లౌకికవాదం ఓటుబేంకు రాజకీయాలకి ఊతపదంగా ఎప్పుడో మారిపోయింది. ఇప్పుడు హిందూ మతవాదం కూడా ఓటుబేంకు రాజకీయాలకి ఉపయోగపడడం ఎక్కువయ్యింది.
హిందువులు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే, ఒక వ్యవస్థీకృత మతం ఏర్పడాల్సిన అవసరం ఉందేమో అని నా ఆలోచన. చారిత్రకంగా చూసినా, సనాతన ధర్మంలో ఎంతో వైవిధ్యం కనిపించినా వ్యవస్థ అంటూ ఉండేది. ఏ రాజ్యానికా రాజ్యంలో ఈ వ్యవస్థ స్పష్టంగా కనిపించేది.
అలాటిది కాకపోయినా, ఈ కాలానికి తగ్గ వ్యవస్థ ఒకటి ఏర్పడితే తప్ప, తీవ్రవాదంతోనో, రాజకీయ ఉద్యమాలవల్లనో హిందువులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోలేరని నాకనిపిస్తుంది. ఎందుకంటే, రాజకీయ ఉద్యమం సఫలమవ్వాలంటే ప్రజల మద్దత్తు కావాలి. ప్రజల మద్దత్తు కావాలంటే ప్రజలందరూ ఏకం కావాలి. అదెలా సాధ్యం?
మతమార్పిడులనీ, లౌకికవాదం పేరుతో చూపిస్తున్న పక్షపాతాన్నీ ఎవరో కొంతమంది ఖండిస్తే ఏవిటి ప్రయోజనం? వాళ్ళకి సమానంగానో అంతకన్నా ఎక్కువగానో వాటిని సమర్థించే వాళ్ళున్నారు కదా.
బయట శక్తులని ఎదురుకొనే ముందు అంతశ్శక్తులని కూడదీసుకోవలసిన అవసరం ఉంది.
ఎలా? ఇది ఆలోచించవలసిన విషయం. మీకు ఆసక్తి ఉంటే దాని గురించి చర్చించ వచ్చు.

Raj said...

మీరు చెప్పినదాంట్లో నిజముంది.

gaddeswarup said...

Nice write up; makes sense to me. Though I am not good at writing Telugu, I think that people should be able to discuss contemporary issues in their own languages. I think that this post does a very good job and with more such blogs I am sure a rich language like Telugu will become a rich medium for discussion of issues that concern us.
Coming back to the main topic, I am not religious and in fact do not like most religions. It seems to me that one problem is that (as you expressed) it is not very clear what Hinduism is. Some go back to Gita but this seems to be a modern innovation due to Tilak and others. Some say Manusmruti, but this was an effort from William Jones through Bengali pundits. When his successor went to Madras many pundits did not even know about manusmriti. Bhartruhari and others do not give a very clear moral code. Lying is bad but ok in some instances and so on. In proselytization, it is advantageous to have one source with clear cut moral code. Perhaps if such can be produced, it might help Hidnduism.I remember an auto driver in Hyderabad telling me that he was disenchanted with modern life and Christianity with a clear cut dos and donts (at least the denomination he was exposed to)showed him the way. I think that people look for clear values and guidance. But I am not sure whether this possible given many of the facts that you expressed. These seem difficult problems.
I mainly wanted to congratulate you on a very clear exposition in Telugu.

చిలమకూరు విజయమోహన్ said...

ప్రస్తుత పరిస్థితిని చక్కగా విశ్లేషించారు.

Anonymous said...

Dear Sir,
Nice analysis. I agree with you 100%.

- Shiv.

Anonymous said...

చైతన్యగారూ, చాలా చక్కగా వ్రాసారు.
"ఇన్ని రోజులు ఈ దేశం లౌకికదేశంగా వుందంటే, దానికి కారణం ఇక్కడి మెజారిటీ మతంలోనే లౌకికత్వం వుండటమేగాని, అదేదో రాజ్యాంగంలో ప్రకటించేస్తే వచ్చింది కాదు." - ఇలాంటి కొన్ని విషయాలు మేకు తలమీద కొట్టినట్టుగా ఉన్నాయి.

Anonymous said...
This comment has been removed by the author.
Rajendra Devarapalli said...

చైతన్య గారు,మీరు హిందువుల్లో అతివాదం/ఉగ్రవాదం/తీవ్రవాదం పెచ్చరిల్లుతుందని భయపడుతున్నారా?లేక భయపెడుతున్నారా?సమస్యను చూపించి వదిలెయ్యకుండా మీకు తోచిన పరిష్కారాలు సూచించండి.

శరత్ చంద్ర said...

బావుంది మీ విశ్లేషణ

కానీ ఈ హిందూ తీవ్రవాదులకి హిందువులందరూ తమ support ఇస్తున్నారంటే మాత్రం నేను అంగీకరించను. ఇలాంటి దాడులు జరుగుతున్నవి ప్రధానంగా BJP అధికారంలోనో లేక బలంగా ఉన్న ప్రాంతాలలోనే. అమాయక జనాన్ని తమ వాగ్ధాటితో ఆకట్టుకుని వాళ్ళతో పని కానించేయడం ఈ BJP, RSS, VHP లాంటి సంస్థలకు కొట్టిన పిండి. వీటికి ఇంకా హిందువలందరి మద్దతు లేదు, ఎప్పటికీ వుండదు కూడా, ఒకవేల ఉంటే మన దేశ వినాశనం తధ్యం . కాని ఒక్కటి మాత్రం నిజం..ఈ 21వ శతాబ్దం లో ఉండవల్సిన పార్టీలు, సంస్థలు మాత్రం కావవి. ఈ విషయంలో మనం MIM లాంటి పార్టీలను తప్పు పట్టాలి. ఇక ప్రతి ఊరిలోను ఈ క్రైస్తవ మత ప్రచారాలు ఒకటి. స్వయాన మన ముఖ్యమంత్రి అల్లుడే ఇలాంటివి చేయడం మన దురదృష్టం.

Anonymous said...

మేధావుల గురించి మీరు చెప్పినదానితో నేను 100% ఏకీభవిస్తాను. గిరీషం స్టైల్లో చెప్పాలంటే మన మేధావులు వట్టి వెధవాయిలోయ్ అనొచ్చు. అలానే హిందూ తీవ్రవాదాన్ని సమర్దిచే వారు పెరుగున్నారని చెప్పొచ్చు. మన కుహన లౌకికవాదులు గుజరాత్లోని అల్లర్లను, బాబ్రీ మసీదు విద్వంసాన్ని వున్న C.D చూపిస్తే ముస్లిం యువత చాలా మంది తీవ్రవాదాన్ని సమర్దిస్తారని చెప్పడం చూస్తే కోపంవస్తుంది. మన హిందువులు కొంతమంది తీవ్రవాదాన్ని సాకుగా చూపి ఇప్పుడు హిందూ తీవ్రావాదులు చేస్తున్న దాడిన్ని సమర్దిస్తున్నారు, మరి దీన్ని ఏమనాలో నాకు అర్థం కావడంలేదు. మతమార్పిడి అక్రమంగా జరిగిందనేది నిజమనే అనుకుందాం. ఒక హిందు మతనాయకున్ని అవతలి మతవర్గం వారే చంపారని అనుకుందాం. అలా జరిగితే మత మార్పిడులను అడ్డుకోవాలి, చంపినవాన్ని ఉరి తీయాలి. అంతే కానీ, అమాయకులైన వారిని చంపడం, నన్‌లపై అత్యాచారాలు జరపడం ఎంత మాత్రం సమర్దనీయం కాదు.

కానీ నేను మీతో ఒక విషయంలో ఏకీభవించలేక పోతున్నాను. అత్యధికులు ఐనా హిందువులు పరమతసహనంతో వున్నారు కాబట్టి లౌకికవాదం ఇంకావుంది అన్నది పూర్తిగా నిజంకాదు, అలా అని పూర్తిగా అబద్దం కాదు. భారతదేశంలో లౌకికవాదం ఇంకావుందతే రాజ్యాంగములో రాసివుంది కాబట్టి కాదు అన్నది నిజం. కేవలం రాజ్యాంగములో రాసినంతమాత్రాన ఏదీ జరగదు. దానిలో రాసినదాన్ని ప్రజలు పాటించాలి. హిందువులతో పాటుగా మిగిలిన మతాలవారు కూడా లౌకిక వాదం వుండడమే లౌకికవాదం ఇంకా ఈదేశంలో వుండడానికి కారణం. ఆలోచించంది భారతదేశంలో దాదాపుగా 20 కోట్ల మంది ముస్లిములు వున్నారనుకుందాం. వారందరూ హిందువులను శత్రువులుగా భావించి,వారిపై దాడులకు దిగితే హిందువులు ఎంతకాలం లౌకికవాదులుగా వుండగలరు. మహా ఐతే ఒక నెల లేదా ఒక సంవత్సరం అంతే.

నిజానికి జరిగుతున్నది ఏమంటే ముస్లిములను కొంతమంది హిందూ చాందసులు, హిందువులను కొంతమంది ముస్లిం చాందసులూ మరియు కుహన లౌకికవాదులు రెచ్చగొడుతున్నారు. అదే దీనికంతకూ మూలకారనం. మీరు ఈవిషయాన్ని సూటిగా చెప్పినందుకు అభినందనీయులు.

చైతన్య కృష్ణ పాటూరు said...

@చదువరి,
మీ వాఖ్యకు వచ్చిన ఎర్రర్‍కు కారణం తెలియట్లేదు. మీ అభిప్రాయం వివరంగా తెలుసుకుందామనుకున్నాను. పర్లేదు. అయినా ఓపికగా మళ్ళీ రాసినందుకు నెనర్లు.

@raj,shiv,విజయమోహన్,
మీ అభిప్రాయాలు తెలిపినందుకు నెనర్లు.

@రాజేంద్ర కుమార్,
సామాన్య హిందువుల్లో అతివాదుల పట్ల సానుభూతి పెరుగుతోందని భయపడుతున్నాను. ప్రభుత్వం హిందూమతం పట్ల, దాని మీద దాడి చేస్తున్న వారి పట్ల చూపిస్తున్న ఉదాశీనత అందుకు ఒక ముఖ్య కారణమవుతోందని అనుకుంటున్నాను. మన వరకు మనం అతివాదుల ప్రభావానికి దూరంగా ఉండటమే చేయగలిగింది. కానీ వారి ప్రభావానికి సామాన్య హిందువులు లోనవ్వకుండా చేయటం మన చేతుల్లో కంటే ప్రభుత్వం చేతిలోనే ఎక్కువుంది.

@sarat,
అతివాదులకు హిందువులందరి మద్దతు ఉందని నేను అనట్లేదు. ఇస్లామిక్ తీవ్రవాదులకు మాత్రం ముస్లింలందరి మద్దతు ఉండే చేస్తున్నారా. ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వకపోయినా, వారి పట్ల సానుభూతి ప్రకటించే వారు పెరుగుతున్నారు. BJP is not a totally unwanted party for the common people, as it was before. వీరు హిందూ మతానికి చెడ్డ పేరు తెచ్చేవారుగా భావించిన వారు కూడా, ఈనాడు వీరి వల్ల హిందూ మతానికి ఎంతో కొంత మేలు జరుగుతోందని భావిస్తున్నారు. ఇలాంటి సానుభూతి పెరగటమే ప్రమాదకరం అంటున్నాను.

చైతన్య కృష్ణ పాటూరు said...

@srikanth,
"అమాయకులైన వారిని చంపడం, నన్‌లపై అత్యాచారాలు జరపడం ఎంత మాత్రం సమర్దనీయం కాదు" - అవును సమర్దనీయం కాదు, ఖండించవలసిన విషయమే. ఆ విషయాన్ని మొదటి పేరాలోనే చెప్పాను.

ఇక మీరు విభేదించిన విషయం. భారతదేశంలో లౌకికత్వం ఇన్ని రోజులు ఉండటానికి కారణం హిందువులకున్న పరమత సహనమే అని చెప్పాను. అందుకు నా వివరణ ఇది. మతం ఎప్పుడూ పరమత సహనం కలిగి వుండదు. అలా వుంటే దానికి జనం పై పట్టు వుండదు. కానీ హిందూ మతానికి పరమత సహనం ఉంది. ఎందుకంటే నిజానికి అది మతం కాదు కాబట్టి. పరమత సహనం అనేది మతంతో సంభందం లేకుండా మన maturityని బట్టి, మన సంస్కారాన్ని బట్టి పాటించే విషయం. ఈ దేశంలో మనకు ఇలాంటి పరమత సహనం కలిగిన క్రైస్తవులు, ముస్లింలు, మన మిత్రులుగాను, కళాకారులుగాను, నాయకులుగాను కనపడతారు. వారిని చూసి మనం వారి మతం కూడా మన లాంటిదే అనుకుంటాం. నిజానికి వారిని సరిగ్గా గమనిస్తే, వారు చాలా వరకు మతాన్ని అంత సీరియస్‍గా పట్టించుకోని వారో, లేక సామాన్యుల కంటే ఎక్కువ maturity వున్నవారో అయ్యుంటారు. మతాన్ని సీరియస్‍గా తీసుకునే ఈ మతస్తులెవ్వరూ, పక్క మతాలు తప్పనే తమ మతశాసనాలకు విరుద్దంగా ప్రవర్తించలేరు. abrahamic మతాలు ఏవీ పక్క మతాలు కూడా కరెక్టేనని ఒప్పుకోవు. ఈ మతస్తులెవరైనా పరమత సహనం కలిగి వున్నారంటే అది వారి సంస్కారమే కానీ, వారి మతసంస్కారం కాదు. తమ మతం తప్పని చెప్పిన విషయాన్ని కూడా సొంత బుద్దితో పరిశీలించి ఆమోదించగల maturity, ఏ మతంలో అయినా కొద్దిమందికే వుంటుంది. కానీ పరమత సహనం తమ జీవన విధానంలో భాగమైపోయిన హిందువుల్లో, laymanకి కూడా అది సహజంగా, ఎంతో కొంత ఉంటుంది, దాన్ని పోగొడితే తప్ప. ఒక్క మాటలో చెప్పాలంటే, అబ్రహమిక్ మతాలలో పరమత సహనం కలవారు, తమ మతాన్ని మీరి, సొంత అభిప్రాయాలు కలిగినవారై వుండాలి. కానీ హిందూ మతంలో పరమత సహనం అనేది, మతంలోపలే ఆమోదించబడుతుంది.

భారతదేశంలో ముస్లింలకు హిందువుల పై పూర్తి స్థాయి దాడికి దిగే బలం లేదు. బలం వచ్చిన రోజు పరమత సహనం చూపిస్తారని అనుకోను. వారి మతం అస్సలొప్పుకోదు. తమ మత పరిధికి లోబడి వుండే ముస్లింలకు పరమత సహనం సాధ్యం కాదు. మతాన్ని మీరినవారికే సాధ్య పడుతుంది.

చైతన్య కృష్ణ పాటూరు said...

@gadde swarup,
హిందూ మతంలో మీకు సమస్యగా అనిపిస్తోంది నిజానికి దానికున్న వెసులుబాటు(flexibility). ఒక ప్రవక్త, ఒక మత గ్రంధంతో సరిపెట్టుకుని, అది దైవశాసనం అనుకుంటే, దానికీ మిగతా మతాలకి తేడా ఏమీ ఉండదు. I strong feel that a religion with a clear cut do's and dont's is very primitive. అటువంటి స్టేజ్ హిందూ మతం ఎప్పుడో దాటి వచ్చేసింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళటం అవాంచనీయం. హిందూ మతంలోని వైవిధ్యాన్ని అర్థం చేసుకోలేని వారికి క్రైస్తవం, ఇస్లాంలాంటి సులభగ్రాహ్యమైన మతాలు నచ్చటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మత గ్రంధాలు నిర్ణయించే తప్పొప్పుల చిట్టా మీద ఆధారపడటం కంటే వాటిని నిర్ణయించిన కారణము, సందర్భము(context) గ్రహించటం ముఖ్యం. అటువంటి అవకాశమూ, స్వేచ్చా హిందూ మతంలో ఉంది. హిందూ మతం యొక్క multi-dimensionalityని అర్థం చేసుకున్నవారికి ఇది స్వేచ్చలా అనిపిస్తే, అర్థంకాని వారికి ఇది గందరగోళంలా అనిపిస్తుంది.

@కామేశ్వర రావు,
హిందువులు ఒక వ్యవస్థీకృత మతంగా ఏర్పడాలన్నదాని పై నా ఆలోచనలు కొంత అస్పష్టంగా ఉన్నాయి. అలా మారాల్సిన అవసరం ఉన్నా, ఆ ప్రయత్నంలో హిందూ మతం తన వైవిధ్యాన్ని, వెసులుబాటుని కోల్పోతుందేమోనని నా భయం. ఇప్పటి హిందువుల్లో కాస్త ఆలోచించగలవారు రకరకాల వాదాలు తెలుసుకుని, తమకంటూ ఒక ఫిలాసఫీని ఏర్పరుచుకుంటున్నారు. అలాంటి వారిని మనం, ఇతను చెప్పిందే పాటించు, ఈ పుస్తకమే ప్రామాణికం అంటూ ఒకే దారి వైపు మళ్ళించలేము. ఇప్పుడు మనం reactiveగా కాక, proactiveగా ఒక్కటవ్వటానికి ప్రయత్నించాలి. Reactiveగా ప్రయత్నిస్తే, హిందూ మతం తన flexibilityని వదులుకుని బిగుసుకుపోయే ప్రమాదం ఉంది. మనమందరం పాటించే వాటిల్లో అంతర్లీనంగా ఉండే కొన్ని ముఖ్యమైన తత్వాల్ని conscious levelలో గ్రహించాలి. అప్పుడే హిందువుల్ని మిగతా మతాల వారికన్నా భిన్నంగా ఉంచేదేమిటో తెలుస్తుంది.

Kathi Mahesh Kumar said...

చాలామంచి విశ్లేషణ. కొంత తీరిగ్గా వుస్తృతంగా వ్యాఖ్యానించాలి!

Anil Dasari said...

>> " I strong feel that a religion with a clear cut do's and dont's is very primitive. అటువంటి స్టేజ్ హిందూ మతం ఎప్పుడో దాటి వచ్చేసింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళటం అవాంచనీయం"

ఎప్పుడు దాటి వచ్చింది? హైందవానికి ఇటువంటి do's మరియు don'ts ఎప్పుడూ లేవు - ఎందుకంటే అది ఒక వ్యక్తో, ప్రవక్తో స్థాపించిన మతం కాదు కాబట్టి. వివిధ సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనమే హైందవం.

మీ వ్యాఖ్యకి ఇదో చిన్న correction మాత్రమే. ఇతర మతాలని హైందవం అనుకరించాలని చెప్పటం నా అభిమతం కాదు.

చైతన్య కృష్ణ పాటూరు said...

@అబ్రకదబ్ర,
ఒకప్పటి హిందూ మతంలో ఇప్పటి మిగతా మతాలలోలా clear do's and dont's ఉన్నాయనే అనుకుంటున్నాను. ఇప్పట్లోలా ఒకే చత్రం కింద లేకున్నా, వివిధ సాంప్రదాయాలకు వాటి వాటి నియమాలు బలంగానే ఉండేవి. వాటి స్థాపకులు, వాటి పవిత్ర గ్రంధాలు వాటికున్నాయి. కాబట్టే అవి ఒకదానితో ఒకటి కలవలేక కీచులాడుకునేవి. అప్పట్లో వైష్ణవులు, శైవులు ఒకరి దేవుళ్ళను ఒకరు కన్నెత్తి కూడా చూసేవారు కారని విన్నాం కదా. ఇప్పటికీ ఈ తేడాలు పాటించేవారు బ్రాహ్మణుల్లో ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి వారందరిని కలపటానికి చాలా మూల్యమే చెల్లించాం. ఈ పట్టింపులు, నిషేధాలు బలహీనపడ్డాకే ఒక్క గొడుగు కిందకి రావటానికి దారి ఏర్పడిందని అనుకుంటున్నాను.

Subba said...

చైతన్యగారూ, చాలా చక్కగా వ్రాసారు.
"ఇన్ని రోజులు ఈ దేశం లౌకికదేశంగా వుందంటే, దానికి కారణం ఇక్కడి మెజారిటీ మతంలోనే లౌకికత్వం వుండటమేగాని, అదేదో రాజ్యాంగంలో ప్రకటించేస్తే వచ్చింది కాదు." - ఇలాంటి కొన్ని విషయాలు మేకు తలమీద కొట్టినట్టుగా ఉన్నాయి.

This is one of the very good article, I read in blogs. Well Written sir. I agree with your opinions. Have a nice time and expecting many more from you
Subba.

Anonymous said...

హయ్య బాబోయి చైతన్య గారూ,

అరుణ్ షౌరీలా చక్కగా balancedగా రాశారు. నా లాంటి extremists మీ రచనా శైలి, తర్కం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.

Kudos!

-మురళి

దేవన said...

తేటగీతిగారు అన్నట్లు నాలాంటి extremists కి ఈ వ్యాసం ఒక speed breaker లాంటిది. ఈ వ్యాసం లో చాలా వరకు మీతో ఏకీభవిస్తాను.

Kathi Mahesh Kumar said...

బ్యాలన్స్డ్ గా రాసిని అనుభూతిని మాత్రం చాలా బాగా ఇచ్చారు. కానీ,ముస్లింల తీవ్రవాదానికి లాజిక్ వెతికిన నాకూ, హిందూతీవ్రవాదానికి గల "సహేతుకమైన" కారణాలు చూపిన మీకూ పెద్ద తేడాలేదు. నాణేనికి అటూ ఇటూ ఉన్నాం అంతే.

పైగా లౌకికవాద మేధావులుకూడా హిందువుల్లోని అసహనానికి కారణాలని చెబుతూ ముస్లిం మరియూ క్రైస్తవుల్లోని మోడరేట్ గొంతులని అసలు పరిగణలోకి తీసుకోకుండా you painted all with same brush.బాంబుదాడుల్ని ఖండించనివారు లేరు..నాలాంటి కుహానా లౌకికవాదులతోసహా. కాకపోతే చెప్పేదల్లా,‘రోగలక్షణాల్ని కాకుండా రోగాల్నీ,దాని మూలాల్నీకూడా రూపుమాపడానికి ఒక ప్రయత్నం కావాలి’ అనిచెబితేమాత్రం అది తప్పుగా అనిపిస్తుంది.

మరొక అపోహ,హిందువులందరూ కులాలకు అతీతంగా reactiveగా ఎకమైపోయి హిందుత్వతీవ్రవాదానికి మద్దత్తునిచ్చేస్తున్నారని.

RSS,VHP,Bajarangadal,BJP లో ఉన్న నిమ్నకులాలెన్ని?దలితులెందరు? అంటే, దాదాపు 65శాతం మంది వీటికి క్రోసుడు దూరంలో ఆల్రెడీ ఉండగా, అగ్రకులాల్లోకూడా ఈ militant/extremist religious nationalism ని నిర్ద్వందంగా త్రోసిపుచ్చుతున్నవారే ఎక్కువ.

ఏక దైవం,ఏక గ్రంధం ఉన్న ముస్లిం,క్రైస్తవానికి ఈ ఝాఢ్యాలు ఉండటం చారిత్రకంగా నిరూపించబడిందే. అందుకే దాన్ని సామూహిక మార్పుద్వారా,సాధించగలమెగానీ react అయ్యి, రక్కసు సృష్టించడంద్వారా కాదు. కానీ, మీరు "ఇన్ని రోజులు ఈ దేశం లౌకికదేశంగా వుందంటే, దానికి కారణం ఇక్కడి మెజారిటీ మతంలోనే లౌకికత్వం వుండటమేగాని, అదేదో రాజ్యాంగంలో ప్రకటించేస్తే వచ్చింది కాదు" అన్న ఒక్కమాటతో మొత్తం భారతీయస్ఫూర్తిని హిందూమతం దయగా చూపించి దెబ్బకొట్టేసారు.

మీరు రాసిన మొదటిపేరాలో మాత్రమే అందరూ చెప్పిన బ్యాలన్స్ ఉందితప్ప, దాన్ని భూమికగా పెట్టుకుని మీరు రక్తికట్టించే హిందూసాంప్రదాయక వాదాన్ని వినిపించారు. అందుకు నా అభినందనలు.

మీరు హిందూ తీవ్రవాదానికి చెప్పిన సహేతుకమైన కారణాలు నాకు అంగీకారమే. కానీ, అవి కొన్ని మతవాద రాజకీయ శక్తులు సృష్టించిన psycho frenzy అనేది నా ప్రఘాఢవిశ్వాసం.

చైతన్య కృష్ణ పాటూరు said...

నేను నా రాతల ద్వారా నా అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటానేగానీ, ఎటువంటి అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నించను. ఆ అవసరం నాకు లేదు. మీరు మిగతావారి అభిప్రాయాల్తో ఏకీభవించనక్కర్లేదు.

నేను "సహేతుకమైన" కారణాలు వెతికింది, అతివాదుల చర్యలకు కాదు. సామాన్య హిందువుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పుకు. ఈ అతివాదులు ఎప్పటి నించో ఉన్నారని, వారికి కొత్తగా సపోర్ట్ పెరుగుతుండటంతో రెచ్చిపోతున్నారని చెప్తున్నాను. ఆ పెరుగుతున్న సపోర్ట్ కి నాకు తోచిన కారణాలు చెప్పాను.

"ముస్లిం మరియూ క్రైస్తవుల్లోని మోడరేట్ గొంతులని అసలు పరిగణలోకి తీసుకోకుండా you painted all with same brush" - ముస్లిం మరియూ క్రైస్తవుల్లో మోడరేట్ గొంతులు లేవని నేను అనలేదు. మతాన్ని సీరియస్‍గా పరిగణించే మతాలలో ఇలాంటి మోడరేట్ అభిప్రాయాలకు విలువ తక్కువంటున్నాను. వీరిలో, తమ మతం పరిధిలో మితవాదులుగా ఉండటం కష్టం అంటున్నాను. అలా ఎందుకనుకుంటునానన్నది srikanthగారికి ఇచ్చిన రిప్లైలో చెప్పాను.

"రోగలక్షణాల్ని కాకుండా రోగాల్నీ,దాని మూలాల్నీకూడా రూపుమాపడానికి ఒక ప్రయత్నం కావాలి’ అనిచెబితేమాత్రం అది తప్పుగా అనిపిస్తుంది" - ఇదే రకమైన దృష్టితో మిగతా అందరి చర్యల్ని కూడా చూస్తే తప్పుగా అనిపించదు. ఒకవైపు మిగతా మతాల వారి చర్యలకు, ఆవేశాలకు మూలాల్ని అన్వేషిస్తూ, ఇంకో వైపు హిందువుల విషయంలో మాత్రం, పెద్ద కారణాలేమీ లేవు, ఇది ఒట్టి psycho frenzy అంటే ఎలా. ఇదే విధంగా మైనారిటీల ఆవేశం కూడా ఒట్టి psycho frenzy అనుకోవచ్చుగా.

హిందువులందరూ ఏకమైపోయి తీవ్రవాదులకు మద్దతిచ్చేస్తున్నారని నేను ఎక్కడా అన్లేదు. వారిని వ్యతిరేకించే వారి సంఖ్య exponential ratioలో తగ్గిపోతోందంటున్నాను. ఈ విషయాన్ని అల్రెడీ saratగారు లేవనెత్తారు. ఒకప్పుడు వారి చేష్టలకు చిరాకు పడ్డ వారు కూడా, ఈ రోజు వాళ్ళు ఉండటం హిందూమతానికి అవసరం అనుకోవటం నా దృష్టిలో పెద్ద మార్పు. అబ్బే, ఇది మీ అపోహ, హిందువులెవ్వరూ అలా లేరు, అని మీరంటే నేను చెప్పగలిగేది ఏమి లేదు. నా అనుభవాలు, పరిచయాలు మీకు కలిగించలేను. ఆంధ్రాలో నాకు తెలిసి బీసీ కులాల్లో sufficient numbersలో RSS సానుభూతిపరులున్నారు. అందులో సభ్యులుగా ఉండి, వారి activitiesలో పాల్గొనేవారు కూడా నాకు తెలుసు. ఇక దళితుల గురించి నాకు పెద్దగా తెలీదు. వీరిలో చాలా మంది క్రైస్తవంలోకి మారిపోయారు కాబట్టి, మిగతా వారు మతం గురించి ఆలోచించే స్థితిలో లేరు కాబట్టి వీరి సపోర్ట్ లేదనే అనుకోవచ్చు.

ఏక గ్రంధం, ఏక దైవం ఉన్న మతాలకు ఈ జాడ్యం ఉందని మీరే అంటున్నారు. ఆ మతాలకు ప్రాణవాయువులాంటి ఈ సూత్రల్ని, ఏ సామూహిక మార్పు మార్చగలదని అనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ దేశపు లౌకికత్వానికి హిందువుల పరమత సహనమే ముఖ్యమైన పట్టుకొమ్మ అని అనుకోవటానికి నాకు అనిపించిన కారణాలను కూడా srikanthగారికి ఇచ్చిన రిప్లైలో చెప్పాను. వాటిలో మీరు వేటితో విభేదిస్తారో, ఎందుకు విభేదిస్తారో చెప్తే బాగుండేది.

Vicky said...

chaithanya,
Well said. But in this whole post you have missed one entity which is Media. Media's role is never addressed.people do know about RSS only after babri masjid incident.Media never talks good about RSS.Is there any large organisation with so much discipline? -No, RSS reaches the needy first when ever there are natural calamities like earth quake in Rajasthan, floods in orissa, or be it Tsunami.Be it media, poticians, actors and every one can blame or bullish any organisation related to Hindu but no one dares to comment on minority institutions.let me talk about one small example here, when M.F.Hussain painted a nude picture of goddess, all the agitations against him were codemned by actors,politicians..saying freedom of expression. when taslima nasrin got physically attacked , i wonder where would these human rights, politicians and every would go?

but one very good point you made is Hindu is not a religion, it is a culture.

వికటకవి said...

హిందువులు ఇలా తీవ్రవాదం చేసేంత మూర్ఖులు కారనుకున్నాను, కానీ ఆ పని చేసారీ మూర్ఖులు. ఇన్నాళ్ళు మనం అంత దిగజారం అని ఓ విధమయిన గర్వం ఉండేది, అది కాస్తా తుస్సుమనిపించేసారు.

gaddeswarup said...

Noticed an article by Velcheru Narayana Rao and Sanjay Subrahmanyam which may be relevant:
http://journals.cambridge.org/action/displayIssue?jid=ASS&volumeId=43&issueId=01&iid=2751324#
It is downloadable until February 28.

Anonymous said...

ayya vikatakavi garu evaraina muslims mi midaki yuddaniki vaste emi chestaru chepandi ninu hinduvuni edurutiragatam valla na mathaniki avamanam ani urukonatara manchidi appudu mi pranalu galilo egiripotai